తెలంగాణలో మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినెట్‌.. మళ్లీ జూన్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  అయితే సడలింపు సమయాన్నిమూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా.. అన్ని వైపుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో దానిని మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు. 

Also Read:గ్రామ జనాభా 250.. కేసుల సంఖ్య 100: ఓ పెళ్లిలో ఒక్కరి నుంచి వూరంతా వైరస్

అలాగే మధ్యాహ్నం 2 గంటల వరకు ఇళ్లకు చేరుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఆలోగా ప్రజలు ఇళ్లకు చేరుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఇక కరోనా నేపథ్యంలో జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వైరస్ తీవ్రత తగ్గినప్పటికి.. ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తేస్తే కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.