బసవతారకం ఆస్పత్రి కూడలి నుంచి రోడ్డు నం.12కు వెళ్లే దారిలో ఆ గుంత ఏర్పడింది. తొలుత ట్రాఫిక్‌ పోలీసు అధికారులు సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. 

హైదరాబాద్: వాహనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోయింది. తెలంగాణ భవన్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తూ ఉంటారు. 

పెద్ద గుంత ఏర్పడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం సాయంత్రం ఐదున్నర సమయంలో ప్రధాన రహదారిపై దాదాపు ఒకటిన్నర మీటర్ల వ్యాసంతో గుంత ఏర్పడింది. దాదాపు అది పది అడుగుల లోతు ఉన్నట్లు అంచనా వేశారు. 

బసవతారకం ఆస్పత్రి కూడలి నుంచి రోడ్డు నం.12కు వెళ్లే దారిలో ఆ గుంత ఏర్పడింది. తొలుత ట్రాఫిక్‌ పోలీసు అధికారులు సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుని మున్సిపల్‌, జలమండలి విభాగాలకు సమాచారం అందించారు.

జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ ముషరఫ్‌అలీ ఇతర అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అది తమ పరిధిలోకి కాదని వెళ్లిపోయారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌ డీజీఎం వినోద్‌ సహా సిబ్బంది చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. జేసీబీ యంత్రంతో ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు.