మహబూబ్‌నగర్:ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఆదివారం సాయంత్రం కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 16 మంది ఉన్నారు. 

అతి వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం వాటిల్లినట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు.జడ్చర్ల నుండి కల్వకుర్తి వెళ్లే రహదారిలో కొత్తపల్లి వద్ద రోడ్డు సరిగా లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మృతులు గోగ్యాతండా, కొత్తపల్లి వాసులుగా స్థానికులు చెబుతున్నారు.

మూలమలుపు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించే పరిస్థితి ఉండదు.ఈ కారణంగానే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొంటున్నట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు.గతంలో కూడ ఇదే ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగినట్టుగా సమాచారం.

"

ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇచ్చినా కూడ సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్ ను ధ్వంసం చేశారు. మృతుుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సంఘటన స్థలం వద్దే గ్రామస్తులు ఆందోళన నిర్వహిస్తున్నారు.