Medak Accident : హైవేపై ఘోర ప్రమాదం ... ధాన్యం ట్రాక్టర్ ను ఢీకొన్న బొలేరో, ఆర్టిసి బస్సు
ట్రాక్టర్, ఆర్టిసి బస్సు మద్యలో బొలేరో నలిగిపోయి డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘోర ప్రమాదం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
మెదక్ : రోడ్డుపక్కన ఆగివున్న ట్రాక్టర్ ను బొలేరో, దాన్ని ఆర్టిసి బస్సు ఢీకొన్నాయి. ఇవాళ(మంగళవారం) తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా చాలామంది గాయాలపాలయ్యారు.
మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలో నేషనల్ హైవే 44 పక్కన ఓ ట్రాక్టర్ ఆగింది. రాత్రి ధాన్యం లోడ్ చేసి ఉదయమే మార్కెట్ కు తీసుకువెళ్లేందుకు వీలుగా రోడ్డుపక్కన నిలిపారు. అయితే తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో వున్నాడో ఏమోగానీ జాతీయ రహదారిపై వేగంగా దూసుకువచ్చిన బొలేరో అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో బొలేరో వెంటే వున్న ఆర్టిసి బస్సు కూడా అదుపుతప్పి రెండు వాహనాలను ఢీకొట్టింది.
ట్రాక్టర్, ఆర్టిసి బస్సు మద్యలో బొలేరో నలిగిపోవడంతో డ్రైవర్ రాహుల్ శ్యాం సావ్య(20) అక్కడికక్కడే మృతిచెందాడు. బొలేరోలోని మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు డ్రైవర్ తో పాటు కొంతమంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
Read More నాంపల్లి అగ్నిప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా డాక్టర్ దుర్మరణం... మృతుల వివరాలివే (వీడియో)
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ముందుగా గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం బొలేరో డ్రైవర్ మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు రామాయంపేట పోలీసులు తెలిపారు.