Regional Parties: కేసీఆర్‌కు ఇంకా ‘థర్డ్ ఫ్రంట్’ ఆశలు? సాధ్యం అవుతుందా? ఎందుకీ కామెంట్ చేశారు?
లోక్ సభ ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, ప్రాంతీయ పార్టీలకే మంచి భవిష్యత్ ఉన్నదని ఆయన కామెంట్ చేశారు. దీంతో ప్రాంతీయ పార్టీల కూటమితో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఆయన ఆలోచనపై మరోసారి చర్చ మొదలైంది.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో లోక్ సభ ఎన్నికలను ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ మెజార్టీ సీట్లను గెలుచుకోలేవని అన్నారు. కేంద్రంలో అధికారం ఏర్పాటు చేయాలంటే ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేశారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే అని జోస్యం చెప్పారు.
తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీజేపీకి ఒప్పందం ఉన్నదని కాంగ్రెస్, కాదు కాదు బీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌ల మధ్యే చీకటి ఒప్పందం అని బీజేపీ ఆరోపణలు చేస్తుండగా.. తమది ప్రజలతో ఒప్పందం అని చెప్పి ఇరు పార్టీలనూ బీఆర్ఎస్ విమర్శిస్తున్నది. ఇదే కామెంట్‌ను ఇంకొంచెం ఇంప్రువైజ్ చేసి కేంద్రంలో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోదని సీఎం కేసీఆర్ అంటున్నారు. అయితే, బీజేపీతో బీఆర్ఎస్‌కు ఓ అండస్టాండింగ్ ఉన్నదనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. వీటిని కౌంటర్ చేయడానికే సీఎం కేసీఆర్ ఈ సంకీర్ణ ప్రభుత్వం అనే టాపిక్‌ను ముందుకు తెచ్చినట్టు విశ్లేషిస్తున్నారు. అయితే, కేసీఆర్ కామెంట్‌తో మరోసారి థర్డ్ ఫ్రంట్ అంశం ముందుకు వచ్చింది.
థర్డ్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ హడావిడి చేసి వదిలిపెట్టారు. మమతా బెనర్జీ, ఉద్దవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, కేజ్రీవాల్‌లతో ఆయన చర్చలు జరిపారు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమిని ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఆ రెండు జాతీయ పార్టీలకు సవాల్ విసరాలని సూచించారు. కానీ, ఆ థర్డ్ ఫ్రంట్ కార్యరూపం దాల్చలేదు.
Also Read : Blackmail: బెంగళూరులో రాత్రిపూట దారుణాలు.. ఢీకొట్టి, బెదిరించి డబ్బు వసూలు చేసే గ్యాంగ్‌లు.. ఎక్స్‌లో చర్చ
బీజేపీ ఎన్డీయేలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇండియా కూటమిలోనూ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ చెప్పిన థర్డ్ ఫ్రంట్ పార్టీలు ఇండియా బ్లాక్‌లో చేరిపోయాయి. జేడీఎస్ ఎన్డీయేలో చేరిపోయింది. నవీన్ పట్నాయక్ బీజేడీ మాత్రం ఇరుపక్షాలకు సమాన దూరం పాటిస్తున్నాయి. కేంద్రంలోని పార్టీకి ఈ సమానదూరం కొంచెం తగ్గుతుంది. కానీ, రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఇండియా కూటమిలో ఇంకా సీట్ల మీద చర్చ జరగకముందే పొరపొచ్చాలు బయటపడుతున్నాయి. అఖిలేశ్ యాదవ్ సహా పలువురు నేతలు ఇండియా కూటమిపై అసంతృప్తి వ్యక్తపరిచారు. అసమ్మతి బయటికి పొక్కినా కూటమి నుంచి మాత్రం ఏ పార్టీకి వైదొలగలేదు.
ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే దానికి ఒక లక్ష్యం, భావజాల సామీప్యత, ప్రతికూల అంశాలను పక్కనపెట్టడం, కూటమి నాయకత్వం, సీట్ల పంపకం, ఇలా చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంటుంది. దీనికి సుదీర్ఘ కసరత్తు అవసరం. ప్రస్తుతమున్న సమయంలో ఇది సాధ్యం కాకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. స్పష్టమైన సమాధానం కాలమే చెబుతుంది.