ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్.. ఇప్పుడు ఎయిర్ టెల్, జియోలను దాటేసింది. ఈ మూడు ప్రధాన నెట్ వర్క్ లు వినియోగదారులకు అతి తక్కువ టారిఫ్ లతో కాల్స్, డేటా ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఓ విషయంలో వొడాఫోన్.. ఎయిర్ టెల్, జియోలను దాటేసింది.

ఇతర టెలికం కంపెనీలతో పోలిస్తే వొడాఫోన్ యూజర్లు వై-ఫైని అత్యధిక సమయం ఉపయోగించుకున్నట్టు తేలింది. వైర్‌లెస్ కవరేజ్ మ్యాపింగ్ సంస్థ ఓపెన్ సిగ్నల్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మార్చి 1 నుంచి 90 రోజులపాటు అధ్యయనం చేయగా, వొడాఫోన్ యూజర్లు 20 శాతం సమయం వై-ఫై కనెక్షన్‌తో అనుసంధానమై ఉన్నట్టు తేలింది. ఆ తర్వాతి స్థానంలో 17 శాతం సమయంతో ఎయిర్‌టెల్ యూజర్లు, ఐడియా యూజర్లు 15 శాతం సమయం వై-ఫైతో అనుసంధానమై ఉంటున్నారు. అతి తక్కువగా జియో యూజర్లు 7 శాతం సమయం మాత్రమే వై-ఫైతో కనెక్ట్ అయి ఉంటున్నారు.
 
జియో యూజర్లు అతి తక్కువ సమయం మాత్రమే వై-ఫైతో ఎందుకు కనెక్ట్ అయి ఉంటున్నారన్న ప్రశ్నకు ఓపెన్ సిగ్నల్ చెప్పిందేమిటంటే.. జియో 4జీ సర్వీసులు 96.4 శాతం అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి జియో యూజర్లకు వై-ఫై నెట్‌వర్క్‌తో పెద్దగా పని ఉండదని ‘ఓపెన్ సిగ్నల్’ తేల్చింది.