బీజింగ్‌: స్మార్ట్‌ఫోన్ల తయారీలో కంపెనీలు కొత్త కొత్త టెక్నాలజీలతో పాటు  వేగం విషయంలో ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అగ్రస్థానం కోసం ‘వివో’ ఆరాటపడుతున్నది. అందుకోసం తన సబ్‌బ్రాండ్‌ ఐ క్యూ ద్వారా వివో రంగంలోకి వచ్చింది. అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

ఏకంగా 12జీబీ ర్యామ్‌తో ఒక స్మార్ట్‌ఫోన్‌ తేనున్నట్టు తెలిపింది.  అంతేకాదు  ఐ క్యూ బ్రాండ్‌ కింద కేవలం ప్రీమియం బాండ్లను మాత్రం లాంచ్‌ చేస్తామని తెలిపింది. ఇందులో భాగంగా తొలి స్మార్ట్‌ఫోన్‌ను వచ్చేనెల ఒకటో తేదీన లాంచ్‌ చేయబోతున్నామని కంపెనీ  పేర్కొంది. 

 ‘ఐక్యూ’ బ్రాండ్ కింద వివో చైనాలో విపణిలోకి విడుదల చేయనున్న ఫోన్ ఇదే కావడం విశేషం. ఇదే విషయాన్ని చైనా సోషల్ మీడియా వేదిక ‘వైబో’లో ప్రకటించింది. ఈ  స్మార్ట్‌ఫోన్‌కు  సంబంధించి ఇతర వివరాలను ఇంకా రివీల్‌ చేయలేదు. 

కానీ అంచనాలైతే భారీగానే ఉన్నాయి. వివో అంతటితో ఆగలేదు. ఈ బ్రాండ్ ఫోన్ వినియోగదారులు, ఫ్యాన్స్ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. 

నూతన తరం స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి వివో వివరాలు ఇప్పుడు వెల్లడించకున్నా.. 12 జీబీ ర్యామ్‌తోపాటు మైక్రో ఎస్డీ కార్డు సాయంతో దాని నిల్వ సామర్థ్యాన్ని 258 జీబీలకు విస్తరించవచ్చు. 

క్వాల్కం స్నాప్‌డ్రాగన​ 855  ప్రాసెసర్‌, ట్రిపుల్‌ రియర్‌ కెమెరాతోపాటు 4000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా వివో ఐక్యూ విపణిలోకి అందుబాటులోకి రానున్నది. ఇందులో ఆరో తరం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌నూ వివో పొందు పర్చింది.

ఈ ఫోన్ టైప్ సీ పోర్ట్, ఎన్ఎఫ్ సీ సపోర్ట్ కలిగి ఉంటుంది. గతేడాది ప్రకటించిన సూపర్ హెచ్డీఆర్ టెక్నాలజీ కూడా వివో ఐక్యూ ఫోన్‌లో ఇమిడి పోనున్నది. ఇతర దేశాల మార్కెట్లలోకి విడుదల చేస్తారా? లేదా? అన్న విషయం వివో ప్రకటించలేదు. ఇటీవలే వివో తన మార్కెట్‌ను భారతదేశ మార్కెట్లోకి విస్తరించడంపై కేంద్రీకరించింది. 

32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ 15 ప్రో స్మార్ట్ ఫోన్ భారతదేశంలో ఆవిష్కరించింది. అయితే వివో ఐక్యూ ఫోన్ ధర ఎంత? ఎప్పుడు, ఏయే పద్దతుల్లో విపణిలో అడుగు పెడుతుందన్న సంగతి ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది.