5జీ సేవలకు అవసరమైన స్పెక్ట్రమ్‌ అధిక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఈ స్పెక్ట్రమ్‌ కవరేజీ రేంజ్‌ చాలా తక్కువ ఉండటంతో 5జీ సేవలకు ఎక్కువ టవర్లు అవసరమవుతాయి. వీటిని ఆఫ్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించాలి. ఇందుకు కనీసం రూ.50,000 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని టెలికం పరిశ్రమ అంచనా వేస్తోంది. 
 
ఒకటి, రెండేళ్లలో అందుబాటులోకి రానున్న 5జీ సేవలపై ప్రస్తుతం కొన్ని కంపెనీలు ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ సర్వీసులకు అవసరమైన స్పెక్ట్రమ్‌ కంపెనీలకు అందుబాటులోకి రాగానే సేవలు మొదలయ్యే వీలుంది.

5జీతో శరవేగంతో మొబైల్‌ డేటా సర్వీసులను వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. 4జీతో పోలిస్తే  5జీ సర్వీసులు వంద రెట్లు వేగం కలిగి ఉంటాయి. గంటల నిడివి కల సినిమాలను క్షణాల్లోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇంటర్నెట్‌ ఆధారంగా భవిష్యత్‌లో కంపెనీలు అభివృద్ధి చేసే ఉత్పత్తులకు 5జీ ఎంతో కీలకం కాబోతోంది. 3డీ సినిమాలు చూడాలన్నా సూపర్‌ ఫాస్ట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ తప్పనిసరి. ఈ-కామర్స్‌ కంపెనీలు పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్‌ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి 5జీ ఎంతగానో దోహదపడనుంది. 

ఇలా పలు రకాల  ప్రత్యేకతలు కల 5జీ సర్వీసులకు వెన్నెముకగా నిలవనుంది మాత్రం ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎ్‌ఫసీ) దీంతో ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించడంపై టెలికాం కంపెనీ (టెల్కో)లు ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. 5జీ నేపథ్యంలో వచ్చే రెండు మూడేళ్లలో టవర్ల సంఖ్యను 5 లక్షల నుంచి 7.5 లక్షలకు పెరగవచ్చని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
 
వీటిలో 70 శాతం టవర్లను ఫైబర్‌తో అనుసంధానించాలంటే కనీసం రూ.50,000 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని అంటున్నారు. ఓఎఫ్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించకుండా 5జీ సేవలను ఆశించిన స్థాయిలో పొందడం సాధ్యం కాదని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. 

5జీ సర్వీసులకు అవసరమైన స్పెక్ట్రమ్‌ అధిక ఫ్రీక్వెన్సీతోపాటు కవరేజీ రేంజ్‌ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ టవర్ల అవసరం ఏర్పడుతుంది. టవర్ల కవరేజీ ఏరియా తక్కువగా ఉండటం వల్ల 4జీతో పోల్చితే 5జీ సెల్‌ సైట్ల సంఖ్య మూడు రెట్లకు పైగా అవసరం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అందుకే ఎక్కువ ఫైబర్‌ అవవసరం ఉంటుందంటున్నారు. విదేశాలకు చెందిన కంపెనీలు కూడా దేశంలోనే తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ఆయా కంపెనీలకు నాణ్యమైన సేవలు అందించడానికి టెలికాం కంపెనీలు ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి.
 
5జీ సర్వీసులతోపాటు ఫైబర్‌ టు హోమ్‌ సర్వీసులు కూడా అందించాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 1.7 కోట్ల కుటుంబాలు ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను పొందుతున్నాయి. 2022నాటికి దేశంలోని 50 శాతం కుటుంబాలకు ఈ సర్వీసులను అందించాలన్న బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

5జీ, ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను విస్తరించాలంటే అందుకు అనుగుణంగా ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎ్‌ఫసీ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించాలని అంటున్నారు. గతేడాది నాటికి దేశవ్యాప్తంగా 14-15 లక్షల కేబుల్‌ రూట్‌ కిలో మీటర్ల ఓఎఫ్‌సీ ఉంది.

2022నాటికి దీన్ని 55 లక్షల కేబుల్‌ రూట్‌ కిలో మీటర్లకు  పెంచాల్సిన అవసరం ఉందని టెలీకమ్యూనికేషన్స్‌ విభాగం లెక్కలు వేస్తోంది. ఇందుకు  రూ.1,80,000 కోట్ల పెట్టుబడులు కావాలని టెలికం పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫైబర్‌ కేబుల్‌ ఏర్పాటు విషయంలో రిలయన్స్‌ జియో దూకుడుగా వ్యవహరిస్తోంది.

ఈ కంపెనీ ఫైబర్‌ టు ది హోమ్‌ సర్వీసుల ద్వారా టీవీ, వాయిస్‌, డేటా సర్వీసులను అందించాలనుకుంటోంది. వచ్చే మూడేళ్లలో 7.5 కోట్ల కుటుంబాలను చేరుకోవాలన్నది జియో లక్ష్యం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫైబర్‌ కేబుల్‌ వేస్తోంది. భారతీ ఎయిర్‌టెల్‌ కూడా ఆప్టిక్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించే పనిలో ఉంది.
 
పొరుగు దేశం చైనాతోపాటు పలు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్‌లో తలసరి ఫైబర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చాలా తక్కువ స్థాయిలో ఉంది. చైనాలో ఇది 18.8 శాతం, అమెరికాలో 19.3 శాతంగా ఉంటే మన దేశంలో మాత్రం కేవలం 2.4 శాతమే. చైనాతో పోల్చితే మన దేశంలో ఫైబర్‌ ఏర్పాటు పదోవంతు ఉండగా.. అమెరికాతో పోల్చితే సగానికి సగం తక్కువగా ఉంది.
 
ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ నిర్మాణం విషయంలో రాష్ర్టాలు కీలక పాత్ర పోషిస్తున్నా.. ఫైబర్‌ కంపెనీలు మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కొన్ని నగరాల్లో ఫైబర్‌ కేబుళ్ల ఏర్పాటుకు అనుమతుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

పెద్ద నగరాల్లో ఫైబర్‌ కేబుల్‌ ఏర్పాటు కోసం కంపెనీలు కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇప్పటికే కొన్ని టెలికాం కంపెనీలు అప్పుల భారంతో సతమతం అవుతున్నాయి. చాలా కంపెనీలు 5జీ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడం, ఫైబర్‌ కేబుల్‌ను వేయడం కష్టంతో కూడుకున్న వ్యవహారమేనని పరిశ్రమవర్గాలు అంటున్నాయి.

టెలికాం కంపెనీలు తమకు అవసరమైన ఫైబర్‌ కేబుళ్లను దేశీయ కంపెనీల నుంచే కొనుగోలు చేస్తున్నాయి. కానీ కొన్ని స్పెషాలిటీ కేబుల్స్‌ను చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అయితే ప్రభుత్వం ఫైబర్‌ కేబుల్స్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచింది. దీని వల్ల కేబుల్స్‌ను దిగుమతి చేసుకుంటున్న కంపెనీలపై వెంటనే ప్రభావం పడుతోంది.