న్యూఢిల్లీ: దేశీయంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ). జాతీయ స్థాయిలో తన పేమెంట్స్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవాలని ఎస్బీఐ నిర్ణయించుకున్నది. అందుకోసం రూపే ‘క్రెడిట్ కార్డు’ను వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

డిజిటల్ చెల్లింపుల్లో ఇప్పటివరకు అమెరికా పేమెంట్స్ గేట్ వే సంస్థలు వీసా, మాస్టర్ కార్డులదే హవా. ఈ నేపథ్యంలో గేట్ వే పేమెంట్స్ విభాగంలోకి అడుగిడాలని ఎస్బీఐ కూడా నిర్ధారణకు వచ్చింది. ఎస్బీఐ ప్రతిపాదన మేరకు ‘రూపే క్రెడిట్’ కార్డును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివ్రుద్ధి చేసింది. ఇది వినియోగదారులకు ప్రత్యేకించి ఎస్బీఐ ఖాతాదారులకు అందుబాటులోకి వస్తే రిటైల్ చెల్లింపులు, లావాదేవీలు దీని ఆధారంగానే సాగనున్నాయి. 

ఎస్బీఐ కార్డు మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ హర్ దయాళ్ ప్రసాద్ స్పందిస్తూ ‘త్వరలోనే వినియోగదారులకు, ఖాతాదారులకు రూపే ఆధారిత క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకు వస్తాం. దీని సేవలను ప్రారంభించడానికి అవసరమైన అనుమతుల అంశం ఎన్పీసీఐ వద్ద చివరి దశలో ఉంది. ఒక్కసారి ఎన్పీసీఐ నుంచి అనుమతి లభిస్తే వెంటనే ‘రూపే-క్రెడిట్’ కార్డును ప్రారంభిస్తాం‘ అని చెప్పారు. 

ప్రస్తుత త్రైమాసికంలోనే రూపే- క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకొస్తామని హర్ దయాల్ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ‘ఇది చాలా చిన్న విసయం. ఒక్కసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది చాలా ప్రజాదరణ పొందుతుంది. దేశవ్యాప్తంగా అత్యధికులు దీన్నే వినియోగిస్తారనడం ఎటువంటి సందేహం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.