న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్‌లోకి రియల్‌మీ మరో రెండు సరికొత్త రకం స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. ఎక్స్, 3ఐ పేరుతో వచ్చిన ఈ మొబైళ్లలో చాలా ప్రత్యేకతల్నే చేర్చింది సంస్థ. రియల్‌మీ ఎక్స్ వేరియేషన్‌తో ప్రీమియం ఫోన్ల విభాగంలోకి ప్రవేశించింది. 

సోమవారం విడుదల చేసిన రియల్‌మీ ఎక్స్ ఫోన్ ప్రారంభ ధర రూ.16,999గానూ, గరిష్ఠ ధర 19,999గానూ నిర్ణయించారు. ఈ ఫోన్లు 4 జీబీ, 8 జీబీ ర్యామ్‌లతో ఇవి లభించనున్నాయి. పాప్-అప్ కెమెరాతో రియల్‌ మీ ఎక్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నది. క్వాల్ కామ్ స్నాప్‌ డ్రాగన్ 710 ప్రాసెసర్‌తో, 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, అదనంగా మరో 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా దీని సొంతం. 

4230 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ కూడా ఉంది. దీని స్టోరేజీ సామర్థ్యం 128 జీబీ. ఇక 3ఐ కనిష్ఠ ధర రూ.7,999 (3జీబీ ర్యామ్)గా, గరిష్ఠ ధర రూ.9,999 (4జీబీ ర్యామ్)గా ఉన్నది. దీని స్టోరేజీని 256 జీబీ ర్యామ్ వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. 

6.2 అంగుళాల హెచ్‌డీ టచ్ స్క్రీన్,  ఆండ్రాయిడ్ పై , 13 మెగాపిక్సల్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. దీని స్టోరేజీ సామర్థ్యం 64జీబీ అని రియల్ మీ యాజమాన్యం తెలిపింది. ఈ నెల 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, తమ సొంత వెబ్‌సైట్లలో ఈ ఫోన్లు లభ్యమవుతాయి. 

ప్రస్తుతం రియల్ మీ దేశవ్యాప్తంగా 50 నగరాల్లో 8 వేల రిటైల్ ఔట్‌లెట్లలో విక్రయాలు చేస్తున్నది. ఈ ఏడాది చివరికల్లా 150 నగరాల్లో 20 వేల రిటైల్ ఔట్‌లెట్లలో విక్రయాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా జరిగిన మొబైల్ ఫోన్ విక్రయాల్లో రియల్‌మీ 2వ స్థానంలో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.