న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్స్‌ తయారీదారీ దిగ్గజం రియల్‌మీ ఇక స్మార్ట్‌టీవీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. 2020 ఏడాదిలో బహుళ స్మార్ట్ టీవీలను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది.

వివిధ రకాల స్మార్ట్ టీవీలతోపాటు ఫిట్ నెస్ బ్యాండ్, పలు ఉత్పత్తులను భారతదేశ విపణిలో ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు. రియల్‌ మీ స్మార్ట్‌ టీవీలు రెండో త్రైమాసికంలో విడుదల కానున్నట్లు తెలిపారు.

దీనికి సంబంధించిన అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు వస్తే ఏప్రిల్‌లో కూడా అవకాశం ఉందని మాధవ్ సేథ్ పేర్కొన్నారు. రియల్‌మీ-బ్రాండెడ్ ఐఓటి పరికరాలతో పాటు ఫిట్‌నెస్ బ్యాండ్ రూపకల్పనపై దృష్టి పెట్టినట్టు వెల్లడించారు.

మరోవైపు రియల్‌మి సీఈవో ఫ్రాన్సిస్‌ వాంగ్‌ ఇప్పటికే తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఫోటో స్మార్ట్‌టీవీలకే సంబంధించినదేనని అంతా భావిస్తున్నారు. రియల్‌ సౌండ్‌, రియల్‌ డిజైన్‌ రియల్‌ క్వాలిటీ కాప్షన్‌తో వచ్చిన టీజర్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

రియల్‌మీ టీవీల పూర్తి ఫీచర్లను అధికారికంగా వెల్లడించకున్నా ఈ స్మార్ట్‌టీవీలలో సౌండ్‌, పిక్చర్‌ క్వాలిటీలు అద్భుతంగా ఉండ నున్నాయని  అంచనా.  అయితే రియల్‌మీ టీవీలలో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ఆ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. 

రియల్ మీ విడుదల చేసే ఉత్పత్తుల వివరాలను మాధవ్ సేథ్ బహిర్గతం చేయలేదు. తమ బ్రాండ్ పరికరాలను ఉపయోగించడానికి ‘రియల్ మీ లింక్‘ యాప్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది.

అది యూనివర్సల్ కంట్రోల్ హబ్ గానే కాకుండా.. స్మార్ట్ హోం యాప్ మాదిరిగా పని చేస్తుందని సమాచారం. ఈ నెల 24వ తేదీన నిర్వహించే ‘రియల్ మీ ఎక్స్ 50 ప్రో’ మొబైల్ ఆవిష్కరణ కార్యక్రమంలో రియల్ మీ విడుదల చేసే మరిన్ని ఉత్పత్తుల వివరాలు వెల్లడవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.