న్యూఢిల్లీ: హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా స్మార్ట్‌ఫోన్ల తయారీలోకి ప్రవేశించి నోకియా.. స్మార్ట్ టీవీల విభాగంలోకి అడుగు పెట్టింది. ఈ మేరకు స్మార్ట్ ఫోన్ల తయారీలో సక్సెస్ అందుకున్న నోకియాతో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌  ఒప్పందం కుదుర్చుకొని దేశీయంగా తయారైన స్మార్ట్‌ టీవీలను ఈ బ్రాండ్‌పై త్వరలో విక్రయించనుంది. 

ఈ స్మార్ట్‌ టీవీల్లో జేబీఎల్‌ సంస్థకు చెందిన స్పీకర్లు వాడుతుండడం ప్రత్యేకత అని బుధవారం ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. జేబీఎల్‌ సౌండ్‌ సిస్టంతో మరింత నాణ్యమైన ధ్వని అనుభూతి కలుగుతుందని పేర్కొంది. అయితే ఈ టీవీలను ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తారన్న సంగతి అటు ఫ్లిప్ కార్ట్ గానీ, ఇటు నోకియాగాని ప్రకటించలేదు. ఆయా స్మార్ట్ ఫోన్ల ధర ఎంత అన్న సంగతి కూడా వెల్లడించలేదు.

also read ప్రజావేగుల ఫిర్యాదులు అవమానకరం.. మా లెక్క తప్పదు: నందన్‌

దీంతో భారతదేశ టీవీ రంగంలో జేబీఎల్ కూడా మొదటిసారి అడుగు పెడుతున్నట్లు అవుతుంది. వినియోగదారులకు సౌండ్ సిస్టం అందించేందుకు జేబీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, ఫ్లిప్‌కార్ట్‌ ప్రైవేట్ బ్రాండ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఫర్నిచర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్,  హెడ్- ఆదర్ష్ మీనన్  తెలిపారు. 

‘నోకియాతో కలిసి పని చేయడం వల్ల మా సంస్థ ద్వారా భారత కస్టమర్లకు అందించే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల నాణ్యత, టెక్నాలజీ మరింత విస్తరించినట్లవుతుంది. ఈ సంస్థతో కలిసి పని చేయడం పట్ల ఉత్సాహంగా ఉన్నాం. 200 మిలియన్ల మంది కొత్త వినియోగదారులను ఈ-కామర్స్‌ తమ వైపు తిప్పుకొనే లక్ష్యంగా మేం కొత్త వస్తువులను ప్రవేశపెడుతున్నాం’ అని ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫర్నీచర్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆదర్శ్‌ మేనన్‌ తెలిపారు.

also read అంతా అనుకున్నట్లే.. బీఎస్ఎన్ఎల్‌లో 80 వేల మందికి వీఆర్‌ఎస్

‘దిగ్గజ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి భారత్‌లో నోకియా బ్రాండ్‌తో స్మార్ట్‌ టీవీలు ప్రవేశపెట్టనున్నాం. నాణ్యతకు, నమ్మకానికి చిరునామాగా ఉన్న నోకియాకు ఇది చారిత్రక అధ్యాయం కానున్నది. ఇండియన్ల టెక్‌ అవసరాలు, అభిరుచులు తెలిసిన ఫ్లిప్‌కార్ట్‌తో జట్టు కట్టడం వల్ల మా ఉత్పత్తులకు ప్రజాదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం.’’ అని నోకియా బ్రాండ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విపుల్‌ మెహ్రోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫ్లిప్‌కార్ట్‌ గతంలో మోటరోలా సంస్థతోనూ ఇలాంటి ఒప్పందాన్నే కుదుర్చుకున్నది. భారత్‌లో తయారు చేసే స్మార్ట్‌ టీవీలను మోటరోలా బ్రాండ్‌తో విక్రయించనున్నారు. అయితే, ఈ బ్రాండ్ల పేరుతో స్మార్ట్‌ టీవీలను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారనే విషయం తెలియాల్సి ఉంది. నోకియా టీవీలు ఇప్పటికే ఈ రంగంలో దూసుకుపోతున్న ఎంఐ టీవీలకు పోటీనిచ్చే అవకాశముందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.