Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ ఐటీ దిగ్గజాలు విలవిల.. రిలయన్స్‌పై టీసీఎస్ ఆధిపత్యం

 విదేశాల్లో ఐటీ కంపెనీలకు భిన్నంగా భారత టెక్నాలజీ సంస్థల మార్కెట్‌ విలువ భారీగా పడిపోతుంది. 

Market crash: Top 3 IT firms lose $31 bn in a fortnight amid virus scare
Author
New Delhi, First Published Mar 19, 2020, 3:42 PM IST

ముంబై/న్యూఢిల్లీ: విదేశాల్లో ఐటీ కంపెనీలకు భిన్నంగా భారత టెక్నాలజీ సంస్థల మార్కెట్‌ విలువ భారీగా పడిపోతుంది. వరుసగా క్షీణిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ల వల్ల గడిచిన పక్షం రోజుల్లో మూడు అగ్రశ్రేణి ఐటీ కంపెనీల మార్కెట్‌ విలువ ఏకంగా 31 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.50 లక్షల కోట్లు) మేర తుడుచుకు పెట్టుకుపోయింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లలో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థగా రిలయన్స్‌ను టీసీఎస్ మరోసారి బీట్ చేసింది. 

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ఐటీ కంపెనీల మార్కెట్‌ విలువకు గండి కొట్టడంతో ఆ పరిశ్రమ తీవ్ర ఆందోళనకు గురవుతున్నది. మార్చి 2 నుంచి మంగళవారం సెషన్‌ ముగింపు నాటికి దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మార్కెట్‌ విలువ అత్యధికంగా రూ.1.45 లక్షల కోట్లు (21 బిలియన్‌ డాలర్లు) పడిపోయింది. 

ఈక్విటీ మార్కెట్‌లో డిమాండ్‌ లేక మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. కాగా ఇదే సమయంలో దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ రూ.70వేల కోట్లు (7 బిలియన్‌ డాలర్లు) విలువ కోల్పోయింది. విప్రో మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.26,000 కోట్లు (3.7 బిలియన్‌ డాలర్లు) పతనమైంది. 

కాగా గడిచిన పక్షం రోజుల్లో మార్కెట్లు తొమ్మిది రోజులు ట్రేడింగ్‌ అయ్యాయి. బుధవారం ముగింపు నాటికి బీఎస్‌ఈలో టీసీఎస్‌ షేర్‌ విలువ 0.44 శాతం కోల్పోయి రూ.1,650.95 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్‌ షేర్‌ 3.70 శాతం పతనమై రూ.535.05లకు పడిపోయింది. విప్రో సూచీ 2.30 శాతం తగ్గి రూ.169.80 వద్ద ముగిసింది. 

అంతర్జాతీయంగా ఐటీ దిగ్గజాల పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ డీఎక్స్‌‌సీ టెక్నాలజీస్‌ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ మూడు బిలియన్‌ డాలర్లు తగ్గింది. ఈ కంపెనీ ఏడాదికి 21 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ కలిగి ఉంది.

కరోనా వైరస్‌ దెబ్బతో ప్రస్తుత ఏడాదిలో ఐటీ పరిశ్రమ వృద్ధి 5 శాతానికి పరిమితం కావొచ్చని పరీక్‌ కన్సల్టింగ్‌ ఐటీ అవుట్‌సోర్సింగ్‌ అడ్వైజర్‌ పరీక్‌ జైన్‌ పేర్కొన్నారు. ఇది ఇన్వెస్టర్లకు తప్పకుండా నష్టాలకు గురి చేయనుందని అభిప్రాయపడ్డారు. 2020లో ఐటీ పరిశ్రమ 3.7 శాతం వృద్ధితో సరిపెట్టుకోవచ్చని గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ గార్టినర్‌ అంచనా వేసింది.

వైరస్‌ ప్రభావంతో ప్రధాన దేశాలు అనేక కార్యకలాపాలను నిలిపివేయడంతో ఈ రంగంపై ప్రభావం పడుతోందని గార్డినర్ విశ్లేషించింది. ఐటీలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, హాస్పిటాలిటి వ్యయం వాటా 40 శాతంగా ఉందని పరీక్‌ కన్సల్టింగ్‌ జైన్‌ పేర్కొన్నారు. ఈ రంగాలు తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయన్నారు. 

మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రికవరీ పెద్ద సవాల్‌గా మారిందని పరీక్‌ కన్సల్టింగ్‌ జైన్‌ అన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నదని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఫండ్‌ మేనేజర్ల సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం మార్కెట్‌ సెంటిమెంట్లు 2008నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దగ్గరగా ఉన్నాయని విశ్లేషించింది.

మార్చి2020 నాటికి నెలనెలా పడిపోతున్న మార్కెట్లు రిస్క్‌ను తట్టుకునే శక్తి కోల్పోవడంతో నిధుల కేటాయింపులో ఫండ్‌ మేనేజర్ల నమ్మకాన్ని దెబ్బ తీసిందనీ, ఫలితంగా 2001 స్థాయికి నిధుల కేటాయింపు చేరిందని అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఎఫ్‌ఎంఎస్‌ ఓ రిపోర్టులో పేర్కొంది. 

చాలా మంది బ్యాకింగ్‌, వృద్ధి చెందుతున్న మార్కెట్లు, యూరోజోన్‌, ఈక్విటీ వంటి ఆస్తుల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకొంటున్నట్టు తెలిపింది. కరోనాతోపాటు ఆర్థిక మాంద్యం, చమురు షాక్‌, రుణఎగవేత భయా లతో ఈ నిర్ణయాలు తీసుకొంటున్నారని పేర్కొంది.

ప్రస్తుతం కరోనా ప్రభావం రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా ఉంటుందని నాలుగింట మూడోంతుల మంది ఫండ్‌ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. వృద్ధిరేటు వచ్చే ఏడాదిలో బాగా కుదించుకుపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. 1994 తర్వాత ఎప్పుడూ అంచనాలు ఈ స్థాయిలో తగ్గించలేదు.

అమెరికా మార్కెట్లలోనూ పతనం కొనసాగుతోంది. కరోనా నుంచి ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవడంపై ఎలాంటి విశ్వాసం కానరాక బుధవారం సెషన్‌ ప్రారంభంలోనే మార్కెట్లు కుప్పకూలాయి. డోజోన్స్‌ 1,048.69 పాయింట్లు లేదా 4.94 శాతం క్షీణించి 20,188.69 వద్ద ప్రారంభమైంది. 

ఎస్‌అండ్‌పీ 500 సూచీ 92.69 పాయింట్లు లేదా 3.66 శాతం తగ్గి 2,436.50 వద్ద తెరుచుకుంది. నాస్‌డాక్‌ 432 పాయింట్లు లేదా 5.90 శాతం పతనంతో ట్రేడింగ్‌ను మొదలు పెట్టింది. జపాన్‌ మార్కెట్లు 1.4 శాతం పతనమై 2016 నాటి కనిష్ట స్థాయికి దిగజారాయి. ఆస్ట్రేలియా సూచీ 6.4 వాతం, నిక్కీ 0.2 శాతం, యూరోపియన్‌ మార్కెట్లు 4.5 శాతం చొప్పున నష్టపోయాయి.

భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అమ్మకాల ఒత్తిడితో బుధవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1710 పాయింట్లు పడిపోయి 28,869కు దిగజారింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 498 పాయింట్లు పతనమై 8,469కు పడిపోయింది. మూడేళ్ల తర్వాత తొలిసారి సెన్సెక్స్‌ 29వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. 

మంగళవారం అమెరికా మార్కెట్లు 6 శాతం పెరగడంతో తొలుత భారత మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఓ దశలో 31,102 గరిష్ట స్థాయికి చేరినా.. అనంతరం మళ్లీ అమ్మకాల వెల్లువతో భారీ నష్టాల వైపు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్‌-30లో ఓఎన్‌జీసీ, ఐటీసీ సూచీలు మాత్రమే లాభపడ్డాయి. మిగితా 28 స్టాక్స్‌ కూడా ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.

నిఫ్టీలో ఒక్క మీడియా సూచీ మాత్రమే 0.39 శాతం పెరిగింది. మిగితా అన్ని రంగాలు నష్టపోయాయి. రియాల్టీ 6.23 శాతం, ఆటో 4.40 శాతం, బ్యాంకింగ్‌ సూచీ 5.87 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. 

మరోపక్క ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి టెలికం కంపెనీలు సొంత లెక్కలు ప్రకటించడంపై సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినట్లు వెలువడిన వార్తలు ఆ రంగ కంపెనీల షేర్లను కుదేలు చేశాయి. మంగళవారం విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) రూ. 4045 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు.

ఇదిలా ఉంటే దేశీయ స్టాక్ మార్కెట్లలో పవర్ ఫుల్ కంపెనీగా టీసీఎస్ మరోసారి నిలిచింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో టాప్ బ్లూచిప్ సంస్థగా టీసీఎస్ నిలిచింది. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి టీసీఎస్ మార్కెట్ క్యాపిటలజైషన్ రూ.6,19,499.95 కోట్లకు చేరుకుంది. ఇది రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,14,179.93 కోట్ల కంటే రూ.5,320.02 కోట్లు అధికం.

Follow Us:
Download App:
  • android
  • ios