ఇప్పుడు మారుమూల గ్రామాలలో కూడా 4G కనెక్టివిటీ.. ఏపి ప్రభుత్వంతో జియో భాగస్వామ్యం..
యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF) ప్రాజెక్ట్ కింద, జియో AP రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4G సేవలను విస్తరించడానికి ఈ టవర్‌లను ఏర్పాటు చేసింది.
విజయవాడ, 25 జనవరి 2024: రిలయన్స్ జియో ఏర్పాటు చేసిన 164 జియో 4జి టవర్లను ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్), పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏర్పాటు చేసిన 164 సెల్ టవర్లను సీఎం ప్రారంభించారు.
యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF) ప్రాజెక్ట్ కింద, జియో AP రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4G సేవలను విస్తరించడానికి ఈ టవర్‌లను ఏర్పాటు చేసింది. గత సంవత్సరం, జియో ఈ ప్రాజెక్ట్ కింద మారుమూల ప్రాంతాలలో ఇప్పటికే 100 టవర్లను ఏర్పాటు చేసింది. కొత్త టవర్ల ప్రారంభంతో, USOF కింద మొత్తం జియో టవర్ల సంఖ్య 264 మార్కుకు చేరుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా ప్రాంతాల గిరిజనులతో కూడా సీఎం మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టు కింద మరిన్ని టవర్లను ఏర్పాటు చేసేందుకు జియో సిద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 2,887 స్థలాలను కేటాయించగా, అన్ని ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇది పూర్తయిన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,549 మారుమూల గ్రామాలకు 4G సేవలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కార్యక్రమానికి ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఐటీ సెక్రటరీ కోన శశిధర్, జియో ఆంధ్రప్రదేశ్ సీఈవో మందపల్లి మహేష్ కుమార్, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.