సంచలనాల రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బాండ్ సేవలను గురువారం ప్రతిష్ఠాత్మకంగా లాంచ్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. ‘రిలయన్స్ జియో జిగాఫైబర్’ పేరుతో ఈ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

ఈ మేరకు జియో వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. జియో ఫైబర్ సేవల కోసం జియో వెబ్ సైట్‌లో అడ్రస్ తెలిపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే, ఇప్పటికే దేశంలోని 1600 పట్టణాల నుంచి 15 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయినట్టు సమాచారం.

ప్రీమియం వినియోగదారులకు జియో ప్లాన్‌ నెలకు రూ.700 నుంచి రూ. 10 వేల వరకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం జియో ఫైబర్ సేవలను ప్రీపెయిడ్ రూపంలో అందిస్తామని, భవిష్యత్‌లో పోస్ట్ పెయిడ్ సేవలనూ అందుబాటులోకి తెస్తామని జియో ఇటీవల తెలిపింది. 

జియో ఫైబర్ వెల్ కమ్ ఆఫర్ కింద వార్షిక ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు  ఫుల్ హెచ్‌డీ టీవీ లేదా 4కే టీవీ, 4కే సెట్ టాప్ బాక్సులను ఉచితంగా జియో అందించనున్నది. జియో ఫైబర్ ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్లాన్ ను కూడా అందిస్తోంది. 

ఈ సదుపాయంతో జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు కొత్త సినిమాలను థియేటర్‌కు వెళ్లకుండానే, ఇంట్లో కూర్చొని వీక్షించవచ్చు. అయితే, ఈ సర్వీస్ వచ్చే ఏడాది మధ్యకల్లా అందుబాటులోకి వస్తుందని అంచనా.  

జియో ఫైబర్ కనెక్షన్ కావాలని కోరుకునే వారు వెబ్‌సైట్‌లో రిలయన్స్ జియో ఫైబర్ లింక్‌కు వెళ్లి, జియో ఫైబర్‌ కనెక్షన్‌ను యాక్సెస్ చేయదలిచిన చోట మీ చిరునామాను (ఇల్లు లేదా కార్యాలయం) పేర్కొనాలి. తరువాతి పేజీలో పేరు, మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడీ తదితర వివరాలను నమోదు చేయాలి.

పేరు, అడ్రస్ నమోదు ప్రక్రియ ముగిశాక, మీ  రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని సంబంధిత బాక్స్‌లో ఎంటర్‌ చేయాలి. ఓటీపీ నిర్ధారించాక జియో సేల్స్‌ ప్రతినిధికి జియో ఫైబర్‌ కనెక్షన్‌ పొందడానికి అవసరమైన పత్రాన్ని (ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఒకటి) అందచేస్తే సరిపోతుంది. 

రిలయన్స్‌ జియో ఫైబర్‌బ్రాడ్‌ బ్రాండ్‌  సేవలను రేపు  ఆవిష్కరించనున్న నేపథ్యంలో మరో బంపర్‌ ఆఫర్‌నూ తన వినియోగదారులకు అందించనుంది. తాజా సమాచారం ప్రకారం కాంప్లిమెంటరీ ఆఫర్‌నూ ప్రకటించనుంది.  

ప్రతి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో డైరెక్ట్-టు-హోమ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రతి కస్టమర్‌కు  ఉచిత సెట్ టాప్ బాక్స్‌ను అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఈ అంచనాలపై రిలయన్స్‌ జియో అధికారికంగా స్పందించాల్సి ఉంది. జియో ఫైబర్ వెల్ కమ్ ఆఫర్ కింద వార్షిక ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు మాత్రమే ఫుల్ హెచ్‌డీ టీవీ లేదా 4కే టీవీ, 4కే సెట్ టాప్ బాక్సులను ఉచితంగా అందిస్తామని ఇటీవల జరిగిన ఏజీఎంలో ముకేశ్‌ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే.