Asianet News TeluguAsianet News Telugu

జియో ఎఫెక్ట్: మాతృభాషలోనే వింటాం: యూట్యూబ్​లో వీక్షకుల ప్రాధాన్యం

మూడేళ్ల క్రితం టెలికం రంగంలోకి ప్రవేశించిన జియో సమూల మార్పులే తీసుకొచ్చింది. తాజాగా ఫైబర్ నెట్ వర్క్ పరిధిలోకి మరో 24 గంటల్లో అడుగు పెట్టేందుకు జియో ఫైబర్ సిద్ధం అవుతున్నది. జియో రాకతో యూ ట్యూబ్ వీక్షకులు పెరిగారు. వారంతా తమ మాత్రుభాషల్లో యూ-ట్యూబ్‌లను వీక్షించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

Jio effect: You Tube viewers prioritise to listen in Mother Tongue
Author
New Delhi, First Published Sep 4, 2019, 11:30 AM IST

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో అందుబాటులోకి వచ్చిన ఫలితంగా టెలి కమ్యూనికేషన్ల వ్యవస్థలో సమూల మార్పులు వస్తున్నాయి. అప్పటి వరకు ఉన్న డేటా ఛార్జీల మోతకు జియో అడ్డుకట్ట వేసింది. ఫలితంగా  అంతర్జాల వినియోగం భారీగా పెరిగింది.

భారీగా పెరిగిన యూ-ట్యూబ్ వీక్షకులు
ఇంటర్నెట్​ వినియోగంతో గూగుల్​ ఆధ్వర్యంలోని వీడియో సేవల విభాగం యూట్యూబ్​ వీక్షకులు భారీగా పెరిగారు. దేశవ్యాప్తంగా చాలా మంది మాతృభాషలో యూట్యూబ్​ను చూడటానికి  ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా తెలుగు, హిందీ తదితర భాషలపై స్థానికులు మొగ్గు చూపుతున్నారు.  

మాతృ భాషల్లోనే యూట్యూబ్ వీడియోలు
స్మార్ట్ ఫోన్లలో వీక్షకులు చూసే వీడియోలు మాతృ భాషల్లోనే ఉంటున్నాయి. ఈ పరిమాణాల్లో వీక్షకులను ఆకర్షించేందుకు.. ముఖ్యంగా తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ వంటి స్థానిక భాషల్లో కంటెంట్​ను రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు పెద్ద నగరాల్లో మాత్రమే కనిపించే కంటెంట్​ రూపకర్తలు.. ఇటీవల చిన్న టౌన్లలోనూ పెరిగిపోయారు.

70కి పెరిగిన లెర్నింగ్ చానెళ్లు
‘ఏడాది క్రితం భారత్​లో 12 లెర్నింగ్ ఛానళ్లు ఉంటే వారికి 10 లక్షల మంది సబ్​స్క్రైబర్లు ఉండేవారు. ఇప్పుడు ఆ ఛానళ్ల సంఖ్య 70కి చేరింది. వీరికి 14.2 కోట్ల మంది సబ్​స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానళ్లకు 100 కోట్ల వరకూ వీక్షణలు వస్తున్నాయి’ అని యూ ట్యూబ్ ఫ్యామిలీ, లెర్నింగ్ ప్రతినిధి డాన్​ అండర్సన్ చెప్పారు. 

లక్షకు పైగా సబ్ స్క్రైబర్లు గల చానళ్లు ఇలా
వీటితోపాటు లక్షకు పైగా సబ్​స్క్రైబర్లు ఉన్న ఛానళ్లు యూట్యూబ్​లో భారీగా ఉన్నట్లు తెలిపారు​. ఫలితంగా మెట్రో నగరాలతో పాటు టూ టైర్, త్రిపుల్ టైర్ పట్టణాల్లో వీడియోల వినియోగం పెరిగింది. ఇలాంటి పట్టణాల నుంచి వస్తున్న కంటెంట్​ రూపకర్తలకు ప్రోత్సాహం అందించి.. మరింత నాణ్యమైన కంటెంట్​ను రూపొందించడానికి పెట్టుబడులు పెట్టనున్నట్లు అండర్సన్​ ప్రకటించారు.

జియో బాటలోనే బీఎస్ఎన్ఎల్ 
భారత్​లో అతిపెద్ద బ్రాడ్​బ్యాండ్ సేవలను అందిస్తున్న సంస్థ బీఎస్​ఎన్​ఎల్. కోటిమంది వినియోగదారులు ఉన్న ఈ సంస్థ రిలయన్స్ ప్రకటించిన జియో ఫైబర్​ను పోలిన మరో ప్లాన్​ను అమలు చేయనుంది. కేబుల్ టీవి ఆపరేటర్లకు, తమకూ లాభం చేకూర్చే దిశగా అడుగులు వేసింది.

సెప్టెంబర్ ఐదో తేదీన జియో ఫైబర్ రంగ ప్రవేశం
రిలయన్స్ జియో ఫైబర్ గురువారం మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపింది. రిలయన్స్ అధినేత ముఖేశ్​ అంబానీ ప్రకటన వివిధ కేబుల్ టీవీ ఆపరేటర్లు, మొబైల్ నెట్​వర్క్​ సంస్థల్లో ప్రకంపనలు సృష్టించాయి. తమ ఖాతాదారులను రక్షించుకునేందుకు నష్ట నివారణ ప్రణాళికలను రచిస్తున్నాయి. గిగా ఫైబర్​ నుంచి పోటీని తట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ కూడా ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. 

జియోపై బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ఇందుకే..
ఇప్పటికే నష్టాల్లో కూరుకొని ఉండటంతోపాటు రిలయన్స్ జియో గిగా ఫైబర్ పోటీదారుగా అవతరించనున్న నేపథ్యంలో ఈ సంస్థకు ఉన్న కోటిమంది వినియోగదారులను కాపాడుకునేందుకు ఫైబర్​ను పోలిన మరో ప్రణాళిక​ను ట్రిపుల్ ప్లే ప్లాన్​ పేరుతో బీఎస్ఎన్ఎల్ అమలు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం పరిధిలో తాము బ్రాడ్​బ్యాండ్, ల్యాండ్​లైన్ సేవలందిస్తామని కేబుల్ టీవీ ఆపరేటర్లు సెట్​టాప్ బాక్స్ అందించాలన్న అవగాహనతో ఒప్పందం కుదుర్చుకుంది.

జియోలాగే ఓఎన్టీ సేవలకు బీఎస్ఎన్ఎల్ రెడీ
ఈ పథకం ద్వారా జియో మాదిరిగానే ఒకే ఆఫ్టికల్ ఫైబర్​ కేబుల్ ద్వారా టీవీ, ఇంటర్నెట్, మొబైల్ సేవలనూ అందించేందుకు నిర్ణయించింది. ఆఫ్టికల్ నెట్​వర్క్ టెర్మినేషన్ (ఓఎన్​టీ) మెషీన్ ద్వారా ఈ మూడు సేవలను అనుసంధానించనుంది. 

ఇలా ఎయిర్‌టెల్‌ ‘ఎక్స్‌స్ట్రీమ్‌’ స్టిక్‌
మరోవైపు ఎయిర్ టెల్ కూడా రిలయన్స్‌ జియోకు పోటీగా కొత్త ఆఫర్‌‌తో ముందుకు వచ్చింది. త్వరలో ఓటీటీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. జియో ఇంతకముందే బ్రాడ్‌ బ్యాండ్‌, డీటీహెచ్‌ సేవలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపింది. అందుకు తగ్గట్టుగా రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌ టెల్ కూడా వినియోగదారులకు ఓటీటీ సేవలను అందించనుంది. 

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్టీమ్ పరికరం అందుకే
అందుకోసం ఎయిర్‌ టెల్ ఓ ప్రత్యేక పరికరాన్ని తయారుచేసింది. ‘ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌’ పేరుతో త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ద్వారా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలను చూడవచ్చు. దీని ధరను రూ.3,999గా నిర్ణయించారు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌ స్టిక్‌ అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌ లా పనిచేయనుంది. ఆండ్రాయిడ్‌ 8.0పై ఇది పని చేస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios