Asianet News TeluguAsianet News Telugu

ఇక వార్ జియో x ఎయిర్‌టెల్ మధ్యే...

ఏజీఆర్ చెల్లింపుల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశంలోని టెలికం సంస్థలకు ఇక్కట్లు వచ్చిపడ్డాయి. ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తే తప్ప వొడాఫోన్​‌‌ ఐడియా భవిష్యత్‌‌ ప్రశ్నార్ధకమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే భారత టెలికం మార్కెట్లో రిలయన్స్ జియోజియో, ఎయిర్‌‌టెల్‌‌ మాత్రమే మిగులుతాయని అంటున్నారు.  

Is AGR issue hurting viability of Vodafone Idea business in India
Author
Hyderabad, First Published Oct 28, 2019, 11:01 AM IST

న్యూఢిల్లీ: ఏజీఆర్ చెల్లింపుల విషయమై సుప్రీం కోర్టు తాజా తీర్పుతో దేశీయ టెలికం రంగంలో రెండు ప్రైవేట్ కంపెనీలే మిగులుతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. టెలికం రంగంలో ఇప్పటికే చాలా కాలంగా కొనసాగుతున్న కన్సాలిడేషన్‌‌ మరింత వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. వొడాఫోన్​‌‌ ఐడియా మనుగడ ఇప్పుడు ప్రశ్నార్ధకం కావడంతో, భవిష్యత్‌‌లో జియో, ఎయిర్‌‌టెల్‌ మాత్రమే మనుగడ కలిగి ఉంటాయని టెలికం నిపుణులు చెబుతున్నారు.

వొడాఫోన్​‌‌ ఐడియా ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్‌‌ ఫీ బకాయిలు ఒకవైపు కొండలా పేరుకుపోవడంతోపాటు, ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకున్న ఈ కంపెనీ వాటిని చెల్లించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వొడాఫోన్​‌‌ ఐడియా చెల్లించాల్సిన మొత్తం రూ. 28,359 కోట్లు,వొడాఫోన్ ఐడియా కంపెనీ దగ్గర ప్రస్తుత నగదు నిల్వలు కేవలం రూ. 21,269 కోట్లే. ఇక వొడాఫోన్​‌‌ ఐడియా మార్కెట్‌‌ క్యాపిటలైజేషన్ కూడా అంతంత మాత్రంగా రూ. 12,442.42 కోట్లు మాత్రమే ఉంది.

also read ఫేస్ బుక్ స్పెషల్ ఫీచర్.. ప్రపంచమంతా అక్కడే

సుప్రీంకోర్టు తీర్పు అమలులోకి వస్తే భారతదేశంలో జియో, ఎయిర్‌‌టెల్‌ ప్రధాన టెలికం ప్రొవైడర్లుగా కొనసాగుతాయని, వొడాఫోన్​‌‌ ఐడియాకు మనుగడే పెద్ద సవాలవుతుందని ఎస్‌‌బీఐ క్యాప్‌‌ సెక్యూరిటీస్‌‌ రిసెర్చ్‌‌ హెడ్‌‌ రాజీవ్‌‌ శర్మ చెప్పారు. వొడాఫోన్​‌‌ ఐడియా అప్పులు ఇప్పటికే రూ. 99,257 కోట్లని, ఇప్పుడు ప్రభుత్వ బకాయిలు చెల్లించడానికి ఆ కంపెనీ ఆపసోపాలు పడకతప్పదన్నారు.

బ్యాంక్‌‌ ఆఫ్ అమెరికా–మెరిల్‌‌ లించ్‌‌ కూడా ఇదే అభిప్రాయాన్ని సమర్థిస్తోంది. వొడాఫోన్​‌‌ ఐడియా ప్రభుత్వ బకాయిలు ఎలా చెల్లించగలదనేది ప్రశ్నగానే మిగులుతోందని, సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం ఈ కంపెనీ మీద ప్రతికూలంగా పడుతుందని పేర్కొంది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎయిర్‌‌ టెల్ రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్​‌‌ ఐడియా రూ. 28,308.73 కోట్లు లైసెన్స్‌‌ ఫీ బకాయిలు (పెనాల్టీ, వడ్డీ కలిపి) చెల్లించాల్సి ఉంది. మొబైల్‌‌ సర్వీసుల ద్వారా టెల్కోలకు వచ్చిన ఆదాయంలో కొంత శాతాన్ని లైసెన్స్‌‌ ఫీ గా నిర్ణయించారు.

ఎయిర్‌‌టెల్‌‌కు లభించిన అదృష్టమేమంటే, టెలినార్‌‌ (రూ. 1950.11 కోట్లు), టాటా టెలిసర్వీసెస్‌‌ (రూ. 9,987.04 కోట్లు) భరించాల్సిన అవసరం లేదు. టెలినార్‌‌ ఇండియా యూనిట్‌‌ను భారతి ఎయిర్‌‌టెల్‌‌ ఇప్పటికే చేజిక్కించుకోగా, టాటా టెలి టేకోవర్‌‌కు డాట్‌‌ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. త్వరలోనే అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రభుత్వ బకాయిల చెల్లింపునకు అవసరమైన కేటాయింపులను అటు ఎయిర్‌‌టెల్‌‌ కాని, ఇటు వొడాఫోన్​‌‌ ఐడియా కాని చేయలేదని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. రెండు సంస్థలు అదనంగా చెల్లించాల్సిన పేమెంట్స్‌‌ ఏవైనా ఆ కంపెనీలపై భారం మోపుతాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌‌ ఇటీవల తెలిపింది. 

ఎయిర్ టెల్ డాట్‌‌కు చెల్లించాల్సిన మొత్తం రూ. 9,800 కోట్లుగా, వొడాఫోన్ రూ. రూ. 9,400 కోట్లుగా తమ ఖాతాలో చూపాయి. ఈ తీర్పు నేపథ్యంలో గత వారం ముగింపు రోజు శుక్రవారం ఎయిర్‌‌టెల్‌‌ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం పతనమై, చివరకు కోలుకుని 3.31 శాతం లాభంతో రూ. 372.45 వద్ద ముగిశాయి. మరోవైపు వొడాఫోన్​‌‌ ఐడియా షేర్లు గురువారమే ఏకంగా 27 శాతం పడిపోగా, శుక్రవారం మరో 5 శాతం నష్టపోయాయి.

also read ఇదేం బాలేదు.. ‘ఐఫోన్’ బటన్ తొలగింపుపై ట్రంప్

ఏజీఆర్ విషయమై సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం భవిష్యత్‌లో జరిగే 5 జీ స్పెక్ట్రం వేలంపైన ఉంటుందని అంచనా.  అప్పులు చేయడానికి టెలికం ఆపరేటర్లు అష్టకష్టాలు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. టెలికం రంగం కుదేలైన సమయంలోనే ఈ తీర్పు రావడం ఇబ్బందికరనన్న అభిప్రాయం వినిపిస్తోంది. దేశంలోని టెలికం రంగం మొత్తం రూ. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుస్తోంది. 

పోటీదారుల బలహీనతలను ఆసరాగా చేసుకుని లాభపడే వీలు రిలయన్స్‌‌ జియోకు చిక్కుతుందని బ్యాంక్‌‌ ఆఫ్‌‌ అమెరికా–మెరిల్‌‌ లించ్‌‌ అభిప్రాయపడుతోంది. బకాయిల చెల్లింపు ప్రభావం ప్రత్యర్ధుల మీద తీవ్రంగా పడితే, 5జీ లో రిలయన్స్ జియో లాభపడే అవకాశం ఉందని తెలిపింది.

టెలికం కంపెనీలకు ప్రభుత్వం కొంత ఊరటనిచ్చే అవకాశమూ లేకపోలేదని మరి కొంత మంది నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా తమకు ఊరట కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. 

కనుక కేంద్రం బకాయిల చెల్లింపుపై రెండేళ్ల వెసులుబాటు కల్పించవచ్చని అంటున్నారు. వెసులుబాటు ప్రకటిస్తే, ముగ్గురు ప్లేయర్లు కొనసాగాలని ప్రభుత్వం భావిస్తున్నట్లని, లేకపోతే మాత్రం మార్కెట్లో ఇద్దరు ప్లేయర్లే మిగులుతారని ఎస్‌‌బీఐ క్యాప్‌‌ సెక్యూరిటీస్‌‌ రిసెర్చ్‌‌ హెడ్‌‌ రాజీవ్‌‌ శర్మ  అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios