న్యూఢిల్లీ: హువావే’కు చైనా అధికార పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)తో  సంబంధాలు పెనవేసుకుపోయాయన్నది అమెరికా ఆరోపణ. అసలు ఆ కంపెనీ సీఈవో వ్యవస్థాపకుడు రెన్‌ జెంగ్‌ఫీనే పీఎల్‌ఏలో ఒకప్పుడు ఇంజినీర్‌గా పనిచేశారు. ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీలో కూడా సభ్యుడనే ప్రచారం కూడా ఉంది. తాజాగా ‘ది పేపర్‌’ పేరుతో చేసిన పరిశోధనలో హువావే సంస్థకు చైనా సైన్యంతో సంబంధాలు బయటపడ్డాయి. 

‘ది పేపర్‌’ హువావే ఉద్యోగుల రికార్డులను పరిశీలించి ఓ విషయాన్ని నిగ్గు తేల్చింది. ‘హువావేలో కీలకమై మధ్యశ్రేణి సాంకేతిక నిపుణుల్లో చాలా మందికి చైనా ఇంటెలిజెన్స్‌ వ్యవహారాలు, సైనిక కార్యక్రమాలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. వీరిలో కొందరు పశ్చిమ దేశాలపై హ్యాకింగ్‌, పారిశ్రామిక గూఢచర్యం నిర్వహించారు’ అని పేర్కొన్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక సీఎన్‌బీసీ తన కథనంలో తెలిపింది. 

ఈ పరిశోధనలో మరో ప్రమాదకరమైన విషయాన్ని గుర్తించారు. ఒక వ్యక్తి సీవీలో హువావేలో పనిచేస్తున్నట్లు అదే సమయంలో సైనిక శిక్షణ విశ్వవిద్యాలయంలో భోధిస్తున్నట్లు ఉంది. అంటే అతను పీఎల్‌ఏలో నేరుగా పనిచేస్తున్నట్లే లెక్క. 

ఒక వర్గం ఉద్యోగులకు చైనా ఆర్మీకి చెందిన స్పేస్‌, సైబర్‌, ఎలక్ట్రానిక్‌ యుద్ధ తంత్ర విభాగాలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే హువావేకు పీఎల్‌ఏతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని ‘ది పేపర్‌’ పేర్కొంది. 

హువావేలో పనిచేస్తున్న మరో  ఉద్యోగి తాను రిపోర్టింగ్‌ చేసిది మాత్రం  చైన సైనిక గూఢచర్య, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి మాత్రమే. హువావే ఉత్పత్తుల్లో సమాచార సేకరణకు అవసరమైన టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్లను ప్లాంట్‌ చేయటమే అతని విధి అని ఈ పరిశోధన పేర్కొంది. 

వియత్నాంలోని ఫ్లూబ్రైట్‌ విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ క్రిస్టఫర్‌ బాల్డింగ్‌, లండన్‌కు చెందిన థింక్‌థాక్‌ హెన్రీ జాక్సన్‌ సొసైటీ సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించాయి. నియామక సంస్థల నుంచి లీకైన హువావే ఉద్యోగుల సమాచారం ఆధారంగా ఈ పరిశోధన చేశారు. 

ఈ సందర్భంగా బాల్డింగ్‌ మాట్లాడుతూ‘వీరిని  గూఢచర్యం చేయమంటూ చైనా ఆదేశించిన ఈ-మెయిల్‌ కాపీలు, ఆడియో రికార్డులు మాత్రం లభించలేదు. కానీ, ఆ సంస్థ ఉద్యోగులు చైనా ఇంటెలిజెన్స్‌లోని పలు విభాగాల్లో పనిచేస్తున్నట్లు ఉండటం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. దీనిపై హువావేనే సమాధానం చెప్పాలి’  అని పేర్కొన్నారు. 

‘సైనిక సంస్థలతో సంబంధాలను ఉన్నవారిని నియమించుకొనే సమయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తాం. వారు తమ పాత సంస్థలతో సంబంధాలను తెంచేసుకున్నట్లు ఆధారాలు చూపాలి. ఇక ఈ  పరిశోధనలో పేర్కొన్న వ్యక్తుల సీవీలపై ఏమీ ధ్రువీకరించలేం. వాస్తవాల ఆధారంగా పరిశోధనలు చేస్తే హువావే స్వాగతిస్తుంది. తక్కువ ఆధారాలు చూపిస్తూ ‘నమ్ముతున్నాం’, ‘కొట్టిపడేయలేం’ వంటి పదాలతో వచ్చే బాల్డింగ్‌ వంటి వ్యక్తులు చేసే పరిశోధనలను పట్టించుకోం’ అని హువావే ప్రతినిధి వెల్లడించారు. 

దీనిపై చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ స్పందించింది.‘అన్ని దేశాల్లో మాదిరేచైనాలో మాజీ సైనిక అధికారులు ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరతారు. కేవలం జీతం కోసం వారు పబ్లిక్‌ సర్వెట్‌ హోదాను వదులుకుంటారు. జాక్సన్‌ సొసైటీలతో కలిసి బాల్డింగ్‌ రాజకీయ ఉద్దేశాలతో ఇలాంటి పరిశోధనలు చేశారు’అని గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎడిటర్‌ హు జింగ్‌ తెలిపారు. 

జింగ్‌ ప్రకటన పొంతన లేనిదని బాల్డింగ్‌ వ్యాఖ్యానించారు.‘మేం మాజీ సైనిక అధికారులు చేరటంపై పరిశోధన చేయలేదన్నారు. హువావేలో పనిచేస్తూ చైనా సైనిక ఇంటెలిజెన్స్‌, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ విభాగాల్లో పని చేస్తున్నట్లు సీవీల్లో పేర్కొన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నామని బాల్టింగ్ చెప్పారు. వారు చైనా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హువావే కోసం పనిచేయడం ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు.