న్యూఢిల్లీ: హెచ్‌టీసీ హైటెక్ కార్పొరేషన్ ఒకప్పుడు అగ్రశ్రేణి స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థల్లో ఒకటి. కానీ కొన్ని నెలలుగా కనుమరుగైంది. దాదాపు ఏడాది తర్వాత భారత మార్కెట్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌తో అడుగుపెట్టింది. ఈ కంపెనీ బ్రాండ్‌ లైసెన్స్‌ పొందిన ‘ఇన్‌వన్‌ స్మార్ట్‌ టెక్నాలజీ’.. హెచ్‌టీసీ వైల్డ్‌ ఫైర్‌ ఎక్స్ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తెచ్చింది. చివరగా గతేడాది జూన్‌లో డిజైర్‌ 12, డిజైర్‌ 12+ పేరిట రెండు స్మార్ట్‌ఫోన్లను హెచ్‌టీసీ తెచ్చింది. 

వైల్డ్‌ఫైర్ ఎక్స్‌లో వ్యక్తిగత భద్రత కోసం కొత్తగా ‘మై బడ్డీ’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీంతో పాటు ట్రిపుల్‌ కెమెరా,  6 నెలల ఉచిత యాక్సిడెంటల్‌, లిక్విడ్‌ డ్యామేజీ ప్రొటెక్షన్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. ఇందులోని 3జీబీ/32జీబీ వేరియంట్‌ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించగా.. 4జీబీ/128జీబీ వేరియంట్‌ ధరను రూ.12,999గా పేర్కొంది. 
ఈ నెల 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు చేపట్టనున్నారు. ప్రారంభ ఆఫర్‌ కింద వొడాఫోన్‌-ఐడియా కస్టమర్లకు రూ.3,750 విలువైన కూపన్లతోపాటు 18 నెలల పాటు రోజుకు 500 ఎంబీ చొప్పున డేటాను అందించనున్నారు. వొడాఫోన్‌ యాప్‌లో ఈ కూపన్లను రీఛార్జి కోసం వినియోగించుకోవచ్చు.

డ్యూయల్‌ నానోసిమ్‌తో వస్తున్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.22 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, వాటర్‌ డ్రాప్‌స్టైల్‌ నాచ్‌, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో వస్తోంది. 12+8+5  బ్యాకప్ మెగాపిక్సెల్‌ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. వీటితో 8X జూమ్‌ వరకు ఫొటోలను తీయొచ్చు. ముందు వైపు 8 మెగాపిక్సల్‌ కెమెరాను అమర్చారు. రెండు వేరియంట్లలోనూ 256 జీబీ వరకు స్టోరేజీని పెంచుకునే వీలుంది. 3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇందులో ఉంది.