న్యూఢిల్లీ: దేశీయ టెలికం రంగం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ‘ఒత్తిడి నిధి’ (స్ట్రెస్‌ ఫండ్‌)ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. దీనికున్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది. ఇటీవల భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా అధినేతలు కేంద్ర ఆర్థిక శాఖ, టెలికం శాఖల మంత్రులను కలిసిన నేపథ్యంలో ఈ ఫండ్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రాధాన్యం సంతరించుకున్నది. 

సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిల దెబ్బకు టెలికం సంస్థలు ఉక్కిరిబిక్కిరవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేయాలనుకుంటున్న ఈ నిధి నుంచి సదరు టెలికం కంపెనీలకు రుణాలను అందించాలని, తద్వారా ఏజీఆర్‌ బకాయిలు తీర్చేలా సహకరించాలని మోదీ సర్కార్ భావిస్తున్నది. 

ఈ నిధితో టెలికం రంగానికి ఓ సమగ్ర రిలీఫ్‌ ప్యాకేజీనీ అందించినట్లు అవుతుందని కేంద్రం విశ్వసిస్తున్నది. అంతేగాక లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీ (ఎస్‌యూసీ) చెల్లింపుల వాయిదాపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. 

క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలో ఓ కమిటీ ఈ అంశాలన్నీ సమీక్షిస్తున్నదని సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితుల మధ్య టెలికం రంగం కుదేలైతే అటు బ్యాంకులకు, ఇటు ఉద్యోగ కల్పనకు ఇబ్బందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే ఈ నిధి మంచి ఆలోచనేనని అంటున్నాయి. 

ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న భారతీయ టెలికం రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా క్యాబినెట్‌ కార్యదర్శి సారథ్యంలోని కమిటీ ముందుకెళ్తున్నది. బ్యాంకుల ద్వారా నిధిని అందుబాటులోకి తెచ్చి.. టెలికం సంస్థలకు దాన్నుంచి రుణాలనిచ్చి.. ఏజీఆర్‌ బకాయిలను తీర్చేందుకు సాయపడాలని కమిటీ సూచించే అవకాశాలున్నట్లు సమాచారం. 

సులభ వాయిదా పద్ధతుల్లో ఈ రుణాలను చెల్లించే సౌకర్యాన్ని టెలికం సంస్థలకు ఇవ్వాలని సిఫార్సు చేయనుందని తెలుస్తున్నది. టెలికం సంస్థలు కోరుతున్నట్లుగా లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల బకాయిల చెల్లింపునకు మరికొంత సమయం ఇవ్వాలని, టెలికం సేవల ధరలనూ పెంచాలని ప్రభుత్వానికి సూచించనున్నట్లు తెలియ వస్తున్నది.

ఏజీఆర్‌ బకాయిల కేసులో సుప్రీం కోర్టు తదుపరి విచారణ తేదీ మార్చి 17లోగా ప్రభుత్వానికి తమ నివేదికను అందజేయాలన్న లక్ష్యంతో కమిటీ పనిచేస్తున్నది. నిజానికి టెలికం శాఖ లెక్కల ప్రకారం టెల్కోల ఏజీఆర్‌ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లయితే.. ఆయా టెలికం సంస్థల అంచనాలు రూ.23 వేల కోట్లుగానే ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా టెలికం సంస్థలపై పెను భారమే పడ్డైట్లెంది. 

కాగా, వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, తొలుత రూ.200.. ఆపై రూ.300లకు పెంచాలని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ ప్రభుత్వానికి సూచించారు. నిరుడు డిసెంబర్‌ ఆఖరు నాటికి రూ.135గా ఉన్నది. గతంతో పోల్చితే మొబైల్‌ చార్జీలు ప్రస్తుతం పెరిగిన సంగతి తెలిసిందే. మిట్టల్‌ ప్రతిపాదన అమలైతే ధరలు మరింత పెరుగడం ఖాయం అన్న అభిప్రాయం వినిపిస్తున్నది.

ఒత్తిడి నిధి అందుబాటులోకి వస్తే వొడాఫోన్‌ ఐడియాకే ఎక్కువ ఉపశమనం కలుగనున్నది. ఈ సంస్థ ఏజీఆర్‌ బకాయిలు రూ.53,038 కోట్లుగా ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆగ్రహం నేపథ్యంలో గత వారం అతి కష్టమ్మీద రూ.3,500 కోట్లు చెల్లించింది. మరిన్ని నిధుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది.

మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌ తమ రూ.35,586 కోట్ల బకాయిల్లో రూ.10 వేల కోట్లను తీర్చేసింది. మిగతా మొత్తాన్ని సుప్రీం పెట్టిన గడువు వచ్చే నెల 17లోగా చెల్లించేస్తామనీ ప్రకటించింది. టాటా టెలీసర్వీసెస్‌ సైతం తమ లెక్కల ప్రకారం మొత్తం బాకీ రూ.2,197 కోట్లను ఇచ్చేసింది. 

Also read:స్మార్ట్ టీవీల రంగంలోకి రియల్ మీ: ఏప్రిల్‌లోనే ఆవిష్కరణ?

ఇక రిలయన్స్‌ జియో తమకున్న స్వల్ప బకాయి రూ.195 కోట్లను ఎప్పుడో తీర్చేసింది. మిగిలిన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ప్రభుత్వ రంగ సంస్థలే కావడంతో వాటి బాకీల సంగతి సర్కారే చూసుకుంటుంది. దీంతో ఇప్పుడు వొడాఫోన్‌ ఐడియా భవిష్యత్తే ప్రశ్నార్థకంగా ఉన్నది. 

ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను తీర్చలేమని, ఏదో ఒక రకంగా ఉపశమనం లభించకపోతే సంస్థను మూసేయడం తప్ప వేరే గత్యంతరమేమీ లేదని వొడాఫోన్‌ ఐడియా వర్గాలు సంకేతాలిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో నిధి ఏర్పాటైతే వొడాఫోన్‌ ఐడియాకు గొప్ప ఊరటేనని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ నిధి ద్వారా రుణాలను పొంది ఏజీఆర్‌ బకాయిలను తీర్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరోవైపు భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఇండస్‌ టవర్స్‌ విలీనానికి టెలికం శాఖ ఆమోదించడం వొడాఫోన్‌ ఐడియాకు కలిసొచ్చింది. ఈ డీల్‌తో వొడాఫోన్‌ ఐడియాకు దాదాపు రూ.4,500 కోట్ల ఆదాయం సమకూరనున్నది. 

ఇండస్‌ టవర్స్‌లో సంస్థకు 11.15 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. విలీనంతో ఇప్పుడీ వాటాను నగదుగా మార్చుకునే వీలు చిక్కింది. ఈ సొమ్ము ఏజీఆర్‌ బకాయిల కోసం వినియోగించి కొంతలో కొంత ఊరట పొందవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.