గత కొంతకాలంగా స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్న వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెలువడిన ఓ రిపోర్ట్ డేటా భద్రతకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించింది. 

గత కొంతకాలంగా స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్న వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి తీవ్రమైన చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే గూగూల్.. ఆండ్రాయిడ్ వినియోగదారుల గోప్యతా సమస్యలను పరిష్కరించాలని చూస్తోంది. అయితే తాజాగా వెలువడిన ఓ రిపోర్ట్ మాత్రం సంచలన విషయాలను వెల్లడించింది. Google Dialer, Messages వంటి యాప్‌ల నుండి సెర్చ్ దిగ్గజం గూగుల్ యూజర్ డేటాను పికప్ చేస్తుందని పేర్కొంది. సదరు యాప్‌లు Googleకి డేటాను పంపుతాయని.. అది కూడా వినియోగదారు అనుమతి తీసుకోకుండానే జరుగుతుందని ఆ రిపోర్ట్ తెలిపింది. ట్రినిటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా ఉన్న Douglas Leith ఈ అధ్యయనాన్ని సంకలనం చేశారు.

Google వినియోగదారులకు సంబంధించిన డేటాను స్వీకరిస్తుందని లీత్ ఈ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇందులో SHA26 హ్యాష్ సందేశాలు, వినియోగదారుల టైమ్‌స్టాంప్‌లు, కాంటాక్ట్స్ వివరాలు, ఇన్‌కమింగ్.. అవుట్‌గోయింగ్ కాల్ లాగ్‌లు, అన్ని కాల్స్‌కు సంబంధించిన సంభాషణ వ్యవధులు ఉన్నాయి. కంటెంట్ hash రూపంలో నిల్వ చేయబడినప్పటిక.. మెసేజ్‌లలోని కంటెంట్‌ను తెలుసుకోవడానికి Google సులభంగా హ్యాష్‌ను రివర్స్ చేయగలదని లీత్ పేర్కొన్నారు. 

గూగుల్ తన డయలర్, Messages యాప్ కోసం డేటా సేకరణపై గోప్యతా విధానాన్ని అందించకుండా తప్పించుకుందని లీత్ చెప్పారు. ఇది చాలా పార్టీలు చేసే స్పష్టమైన ఉల్లంఘన అని పేర్కొన్నారు. ఇక, లీత్ గత సంవత్సరం ఈ అధ్యయనంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత అతను ఈ యాప్‌ల గురించి తాను కనుగొన్న సమాచారం గురించి Googleకి తెలియజేశారు. గోప్యతలో లోపాలను నివారించడానికి గూగుల్ కొన్ని క్లిష్టమైన మార్పులు చేయాలని ఆయన సూచించారు.

అయితే తన వంతుగా Google Dialer, Messages నుంచి డేటాను స్వీకరించడానికి గల కారణాలపై గూగుల్ వివరణ ఇచ్చింది. మెసేజ్ సీక్వెన్సింగ్ బగ్‌లను గుర్తించేందుకు మెసేజ్ హ్యాష్ సేకరించబడుతుందని పేర్కొంది. మరియు ఫోన్ లాగ్‌లు RCS ప్లాట్‌ఫారమ్ ద్వారా పంపబడే వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను స్వయంచాలకంగా గుర్తించడంలో సహాయపడటానికి తీసుకోబడ్డాయి. అయితే ఈ వివరణలు నిజంగా Google కోరుకునే క్లీన్ చిట్‌ను అందించనప్పటికీ.. భవిష్యత్తులో Android వెర్షన్‌లు మరియు యాప్ స్టోర్ విధానాలు చాలా అవసరమైన మార్పును తీసుకువస్తాయని తాము ఆశిస్తున్నామని లీత్ పేర్కొన్నారు. తద్వారా వినియోగదారులు యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు సురక్షితంగా భావిస్తారని అభిప్రాయపడ్డారు.