శాన్‌ఫ్రాన్సికో: మానవ హక్కులను ఉల్లంఘిస్తూ, వలసదారుల పట్ల యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వందల గూగుల్‌ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇమిగ్రేషన్‌ అధికారులతో కలిసి పనిచేయరాదని 600 మందికి పైగా గూగుల్‌ ఉద్యోగులు సంతకాలతో కూడిన పిటిషన్‌ను కంపెనీ అధికారులకు సమర్పించారు. 

అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ (సీబీపీ)కి క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్ సేవలు అందిస్తున్న సంస్థల్లో గూగుల్ ప్రధానమైంది. అమెరికా కస్టమ్స్‌, బోర్డర్‌ ప్రొటెక్షన్ ‌(సీబీపీ)తో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలకు సంబంధించి ఎలాంటి ఒప్పందం చేసుకోవద్దని వారు గూగుల్‌ యాజమాన్యాన్ని కోరారు. ప్రస్తుతం గూగుల్‌తో పాటు, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలను అందిస్తున్నాయి. 

‘అందరూ కలిసి పని చేయాల్సిన సమయం వచ్చింది. సీబీపీతో గూగుల్‌ చేసుకునే ఏ ఒప్పందానికి సంబంధించిన పనినీ మేము చేయబోం’ అని ఉద్యోగులు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ (సీబీపీ)తో కలిసి పని చేయబోమని బహిరంగంగా ప్రకటించాలని కోరుతున్నారు.

అయితే, దీనిపై గూగుల్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వలసలకు సంబంధించిన వ్యవహరాల విషయంలో ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎలాంటి సహాయం లభించడం లేదని గూగుల్‌ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ‘చరిత్ర స్పష్టంగా ఉంది. ఇది ఇలాంటివి కుదరదు అని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.’ అని గూగుల్‌ ఉద్యోగులు తెలిపారు.

గతేడాది కూడా పెంటగాన్‌కు చెందిన అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్టును గూగుల్ వదులుకోవాల్సి వచ్చింది. పెంటగాన్‌తో 10 బిలియన్ల డాలర్ల విలువ గల కాంట్రాక్టును ఉద్యోగుల నిరసన వల్ల గూగుల్ వదిలేసుకున్నది.