Elon Musk: ట్విట్టర్‌ను సొంతం చేసుకునేందుకు ప్లాన్- బి కూడా..!
విభిన్న తరహాకు చెందిన పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ట్విట్టర్ పై మరో మైండ్‌గేమ్ షురూ చేశాడు. ఇటీవల ట్విట్టర్ లో మేజర్ షేర్ హోల్డర్‌గా మారిన ఎలాన్ మస్క్.. ఆ తర్వాత ఏకంగా ట్విట్టర్‌ను ఏకమొత్తంగా కొంటానంటూ భారీ ఆఫర్ ఇచ్చాడు. దీనిపై చర్చ సద్దుమణగకముందే మరో కొత్త చర్చకు తెరతీశాడు.
ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎలాన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ అంశం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. 9.2 శాతం వాటాను దక్కించుకొని ట్విట్టర్‌లో అతిపెద్ద షేర్ హోల్డర్‌గా మస్క్ ఉన్నారన్న విషయం బయటికి వచ్చినప్పటి నుంచి చాలా పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో చేరడం పక్కా అన్న తరుణంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మనసు మార్చుకున్నారు. ట్విట్టర్ బోర్డులో సభ్యుడిని కాలేనని చెప్పేశారు. అనంతరం ట్విట్టర్‌లో మార్పులు, భావ ప్రకటన స్వేచ్ఛ సహా చాలా విషయాలపై పోల్స్ నిర్వహించారు. కొన్ని కామెంట్లు చేశారు. ఏమైందో కానీ కొన్నింటిని తొలగించారు. అయితే తాజాగా ఏకంగా ట్విట్టర్ మొత్తాన్ని దక్కించుకోవడంపై స్పేస్ ఎక్స్ బాస్ మస్క్ గురి పెట్టారు. 43 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3.2లక్షల కోట్లు) ట్విట్టర్‌ను సొంతం చేసుకుంటానని ఆఫర్ కూడా ఇచ్చారు. అయితే ట్విట్టర్ తన ఆఫర్‌ను తిరస్కరించవచ్చని తాజాగా మస్క్ చెప్పారు. అలాగే ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
భారీ ఆఫర్ ప్రకటించినా.. ట్విట్టర్ తన సొంతం అవుతుందో లేదో కచ్చితంగా చెప్పలేనని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. వాంకూవెర్‌లో జరిగిన టెడ్ ఈవెంట్ లో మస్క్ మాట్లాడారు. “ఆ ఆఫర్ ద్వారా ట్విట్టర్‌ను సొంతం చేసుకుంటానో లేదో కచ్చితంగా చెప్పలేను. అయితే నా ఆఫర్‌ను ట్విట్టర్ బోర్డు తిరస్కరిస్తే, నా దగ్గర ప్లాన్ -బీ కూడా ఉంది” అని మస్క్ అన్నారు. అయితే ఆ ప్లాన్ - బీ ఏంటో మాత్రం వివరించలేదు.
43 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను సొంతం చేసుకోవాలనే ప్రతిపాదనను యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో ఎలాన్ మస్క్ వెల్లడించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు సరైన వేదికను సృష్టించేందుకే ఈ ఆఫర్ ఇచ్చానని, డబ్బు సంపాదన కోసం కాదని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ట్విట్టర్ డీల్‌ను పూర్తి చేసేందుకు తన వద్ద అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్‌కు 8.19 కోట్ల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.
మరోసారి పోల్
ట్విటర్‌ను ప్రైవేట్ పరం చేసేందుకు ఒక్కో షేరుకు ఆఫర్ చేసిన 54 డాలర్లు షేర్ హోల్డర్ల అంచనాలను అందుకుంది కానీ బోర్డు అంచనాలు అందుకోలేకపోయింది అంటు ప్రశ్నించి అవునో కాదో చెప్పాలంటూ ట్విటర్‌లోనే పోల్ చేశాడు. పది గంటల వ్యవధిలో ఎలన్‌మస్క్ ట్వీట్ రైట్ అంటూ 84 శాతం మంది, కాదంటూ 16 శాతం మంది ఓటేశారు. ఫ్రీ స్పీచ్‌కి ఓ ప్లాట్‌ఫామ్ ఉండాలనేది తన లక్ష్యమంటూ గతంలో ఎలన్‌మస్క్ చెప్పారు. ఆ తర్వాత రెండేళ్లకు ట్విటర్‌లోనే ఫ్రీ స్పీచ్‌కి అవకాశం ఉందా అంటూ పోల్ నిర్వహించాడు. అది జరిగిన పది రోజులకే ట్విటర్‌లో మేజర్ షేర్ హోల్డర్ అయ్యాడు. ఆ తర్వాత ట్విటర్ బోర్డు సభ్యత్వం తీసుకోవాలని కోరితే దాన్ని నిరాకరించి మొత్తం ట్విటర్‌ను అమ్మేయాలంటూ ఆఫర్ చేసి ట్వీటర్ యాజమాన్యాన్ని తీవ్ర ఒత్తిడిలో నెట్టారు ఎలన్‌మస్క్.