Asianet News TeluguAsianet News Telugu

ఎనిమిదేళ్లు దాటితే ‘ఫైర్’: కాగ్నిజెంట్‌లో ఉద్యోగం ఔట్?


అమెరికా సాఫ్ట్ వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ మరో దఫా ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం చేసిందని సమాచారం. ఎనిమిదేళ్ల అనుభవం గడించిన ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు పునర్వ్యస్థీకరణ పేరిట ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లే క్యాంపస్‌ నియామకాల్లో జాప్యం జరుగుతున్నది. మొత్తంగా ఖర్చు తగ్గించుకునే పనిలో కాగ్నిజెంట్ పడింది. 

Cognizant may lay off more, delays campus hires
Author
Bengaluru, First Published Aug 17, 2019, 10:56 AM IST

బెంగళూరు: ఐటీ సేవల దిగ్గజం ‘కాగ్నిజెంట్‌’ మరోసారి ఉద్యోగులను తగ్గించుకునేందుకు సిద్ధం అవుతుందన్న వార్తలొస్తున్నాయి. ఈసారి వందల మందిని తగ్గించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖర్చు తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఉద్యోగాలను ఇంటిదారి పట్టించాలని కంపెనీ నిర్ణయించిందని ఒక ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది. 

నిజానికి ఉద్యోగుల తొలగింపు కాగ్నిజెంట్‌ సంస్థలో కొత్త కాదు. 2017లో 4000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మరో 400 మందిని స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా ఇంటికి పంపింది. గతేడాది కూడా వందల మందిని కొలువుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో మరోసారి ఉద్యోగ కోతల విషయం వార్తలు వస్తుండడంతో ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఖర్చులను అదుపు చేసేందుకు కంపెనీ మరిన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవర్గాలు చెబుతున్నాయి. 

కంపెనీ కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) బ్రియాన్‌ హంప్రీస్‌ కంపెనీని వృద్ధి బాట పట్టించేందుకు పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే వ్యయాలను తగ్గించడంపై కాగ్నిజెంట్ యాజమాన్యం దృష్టి సారించింది. సిబ్బందిని మరింత మెరుగ్గా నియోగించుకోవాలని భావిస్తోంది. 

అనవసర ఖర్చుకు చరమగీతం పాడటమే కాక కార్యకలాపాల డూప్లికేషన్‌ తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది. ఇందుకనుగుణంగానే కాగ్నిజెంట్ సంస్థలో పని మొదలైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే పనితీరు అంతంత మాత్రంగా ఉండి ఏ ప్రాజెక్టును కేటాయించకుంటే అలాంటి వారిని వేరు చేసే ప్రక్రియ మొదలవుతుందని, ఇది మదింపు ప్రక్రియలో భాగమేనని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలంటున్నాయి. ఇలాంటి వారి సంఖ్య వందల సంఖ్యలో ఉంటుందని చెబుతున్నారు.
 
‘కాగ్నిజెంట్‌ ఫ్రెషర్స్‌’ పేరుతో కొంత మంది ఒక ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఏర్పాటుచేశారు. తమకు గత మార్చిలో కంపెనీ నుంచి ఆఫర్‌ లెటర్లు వచ్చాయని, కానీ ఇప్పటి వరకు జాయినింగ్‌ తేదీలు మాత్రం తెలియజేయలేదని వారు చెబుతున్నారు. బెంచ్‌పైకి వెళ్లే ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటం వల్లే జాయినింగ్‌ తేదీల్లో జాప్యం జరుగుతుందేమోనని ఒకరు పేర్కొన్నారు. 

ఎలాంటి ప్రాజెక్టులు లేకుండా ఉన్న వారిని బెంచ్‌పై ఉన్నట్లు చెబుతుంటారు. ఇలాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటే కొత్తగా తీసుకునే వారి నియామకాల్లో జాప్యం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగుల తగ్గింపు విషయమై కాగ్నిజెంట్‌ స్పందించలేదు. మార్కెట్లో వచ్చే ప్రతి ఊహాగానాలపై స్పందించలేమని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

రెండో త్రైమాసికంలో కాగ్నిజెంట్‌ రాబడి అంచనాలకు మించి ఉన్నట్టు కాగ్నిజెంట్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరోవైపు జూన్‌ నుంచి ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు. వేల మంది విద్యార్థులను తీసుకుంటున్నామని, వీరికి కాగ్నిజెంట్‌ అకాడమీలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కంపెనీ క్యాంపస్‌ ఆఫర్లకు కచ్చితంగా కట్టుబడి ఉంటుందన్నారు.
 
కాగ్నిజెంట్‌ ఈ ఏడాది ప్రారంభంలో తన రాబడిలో వృద్ధి అంచనాలను తగ్గించుకుంది. ఈ సందర్భంగా కొత్తగా తీసుకునే ఉద్యోగుల సంఖ్య రాబడిలో వృద్ధికన్నా మించిపోయిందని పేర్కొంది. ఇది మార్జిన్లు తగ్గడానికి దారితీస్తోందని తెలిపింది. ఈ ఏడాది జూన్‌ చివరినాటికి కాగ్నిజెంట్‌లో 2,88,200 మంది ఉద్యోగులు ఉన్నారు. 

గత ఏడాది ఇదే కాలం 2,68,900 మందితో పోల్చితే ఉద్యోగుల సంఖ్య 7 శాతం పెరిగింది. 2018 చివరి వరకు కాగ్నిజెంట్ సంస్థలో 2,81,600 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 69 శాతం మంది అంటే 1,94,700 మంది భారత్‌లోనే పని చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios