Aadhaar-PAN Details: పాన్, ఆధార్ నెంబర్ వివరాలను షేర్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..!
ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలను ఎవరితోను పంచుకోరాదని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (CBIC) ప్రజలను ఉద్దేశించి గురువారం ట్వీట్ చేసింది.
ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలను ఎవరితోను పంచుకోరాదని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (CBIC) ప్రజలను ఉద్దేశించి గురువారం ట్వీట్ చేసింది. ఈ వివరాలతో మోసగాళ్లు జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆధార్, పాన్ వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, గోప్యతను పాటించాలని కోరింది. అకారణంగా లేదా నగదు ప్రయోజనాల కోసం ఈ వివరాలను ఇతరుల చేతికి అందిస్తే దుర్వినియోగం చేస్తున్నారని, నకిలీ సంస్థలను సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు తెలిపింది.
బోగస్ కంపెనీల పేరుతో నకిలీ ఇన్వాయిస్‌లను సృష్టించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)ని మోసపూరితంగా క్లెయిమ్ చేస్తున్నారని CBIC తెలిపింది. 'పన్నుల ఎగవేత కోసం జీఎస్టీలో నకిలీ ఎంటిటీలను సృష్టించేందుకు ఉపయోగపడే మీ వ్యక్తిగత డేటాను రక్షించుకోండి' అని ట్వీట్ చేసింది. గతంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) అధికారులు అనేక బోగస్ సంస్థలను చేధించారు. అసలు వస్తువుల సరఫరా లేకుండా నకిలీ ఇన్వాయిస్‌ను పెంచేందుకు ఉపయోగించారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని మోసపూరితంగా క్లెయిమ్ చేయడమే వీరి ఉద్దేశ్యం.