వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. అగ్ర రాజ్యం అమెరికా కూడా చిగురుటాకులా వణికిపోతున్నది కొవిడ్-19 బాధితుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలను కోల్పోయారు.

ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు టెక్ దిగ్గజం ‘ఆపిల్’, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం, ఫెడరల్ ఏజెన్సీలతో కలిసి మొబైల్ యాప్, వెబ్ సైట్ ప్రారంభించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ యాప్ సాయంతో సెల్ఫ్ స్క్రీనింగ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
 
అలాగే ఆపిల్ తయారు చేసిన ఈ యాప్ ఆన్ లైన్ స్క్రీనింగ్ వెసులుబాటు కలిగిస్తుంది. దీనివల్ల మీరు ఏ దేశంలో తిరిగి వచ్చారన్న సంగతి కూడా తెలుసుకోవచ్చు.

కరోనా వైరస్ సోకినప్పుడు ఉండే లక్షణాలు, అందుకు పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు తదితర సమాచారం అంతా ఈ మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో లభిస్తుంది. కరోనా వైరస్‌కు సంబంధించిన ఈ సమాచారం తెలుసుకోవడానికి ‘కొవిడ్-19’ పేరుతో ఈ యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నది. 

కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న సంగతి తెలుసుకున్న తర్వాత స్థానిక, రాష్ట్ర స్థాయి ఆరోగ్య వసతుల సమాచారం అందజేస్తోంది ఈ యాప్. దీని ద్వారా ప్రజలు తమ ప్రశ్నలకు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి నేరుగా సమాధానాలు తెలుసుకోవచ్చు. 

ఇదే విధంగా ఈ సమాచారం అంతా వెబ్ సైట్‌లో కూడా ఉంటుందని కరోనా వైరస్ కట్టడి చేయడంలో ఈ యాప్, వెబ్‌సైట్‌ కీలక పాత్ర పోషిస్తాయని వైట్ హౌస్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ యాప్ ఆపిల్ ఫోన్ల వినియోగదారులకు మాత్రమే కాకుండా విండోస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

also read:కరోనాపై పోరు.. రూ.25 కోట్ల మెడిసిన్స్ సరఫరాకు సన్ ఫార్మా రెడీ

ప్రస్తుతం ఈ యాప్, వెబ్ సైట్ సేవలు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. త్వరలో అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. వెబ్ సైట్ సేవలను భారత్‌లో పొందేందుకు అవకాశాలు ఉన్నాయి.

ఇంతకుముందు సెర్చింజన్ ‘గూగుల్’ కూడా కరోనా వైరస్ పూర్వాపరాలు తెలుసుకునేందుకు తన వినియోగదారులకు యాప్, వెబ్ సైట్ అందుబాటులోకి తెచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహా మేరకే ఈ యాప్, వెబ్ సైట్ ఏర్పాటు చేయడం విశేషం.