Made In India: ‘మేడ్ ఇన్ ఇండియా’.. ఐఫోన్-13 తయారీ భారత్‌లోనే.. ఎక్కడో తెలుసా..?
ఐఫోన్ 13 ఉత్పత్తిని యాపిల్ కంపెనీ భారత్‌లో ప్రారంభించింది. చెన్నైలోని ఫాక్స్‌కాన్ తయారీ కేంద్రంలో ఈ ఫోన్‌ను ఉత్పత్తి చేస్తోంది. భారత్‌లోని వినియోగదార్ల కోసం ఐఫోన్ 13ను స్థానికంగా ఉత్పత్తి చేయడం ఆనందంగా ఉందని యాపిల్ వెల్లడించింది.
ప్రపంచ దేశాలకు భారత్ మొబైల్ మార్కెట్ అతిపెద్ద బిజినెస్ మార్కెట్‌గా మారింది. ప్రముఖ పాపులర్ స్మార్ట్ ఫోన్ మేకర్ల దృష్టి అంతా ఇప్పుడు భారత మార్కెట్‌పైనే ఉంది. భారత్ వేదికగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే దిశగా మొబైల్ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కంపెనీ నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియాకు ఊతం లభించనుంది. దీంతో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారవ్వాలనే ఇండియా కల నెరవేరనుంది.
ఆపిల్ కంపెనీ భారత్‌లో తన ఐఫోన్ 13 తయారీని త్వరలోనే ప్రారంభించనుంది. ఈ మేరకు తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపానగల ఆపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ భాగస్వామ్య కంపెనీ ఫాక్స్‌కాన్స్‌తో ఒప్పందం చేసుకుంది. అంతేకాదు, ఇప్పటికే ఆపిల్ ఐఫోన్ 13 ట్రయల్ తయారీని ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. భారత్‌లో ఆపిల్ ఫోన్లను ఉత్పత్తిని పెంచి గ్లోబల్ మార్కెట్లలో ఐఫోన్ 13 మోడల్ సరఫరా చేసేందుకు ఆపిల్ కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉన్న ఆపిల్ కంపెనీ బలోపేతానికి తోడ్పడనుందని ఇండియాలోని ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. భారతదేశంలో స్థానిక వినియోగదారుల కోసం ఐఫోన్ 13 తయారు చేసేందుకు తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు.
ఐఫోన్ 13 తయారీ తర్వాత మిగతా అన్ని మోడళ్లను ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ కంపెనీల ద్వారా తయారుచేయనుంది. అలాగే, మూడో భాగస్వామి పెగట్రాన్‌కూడా ఈ నెలలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి ప్రారంభించనుంది. కాగా, ఆపిల్ కంపెనీ భారత్‌లో ఐఫోన్ల తయారీని 2017లో అంటే ఐదేళ్ల క్రితం ప్రారంభించింది. ప్రస్తుతం ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లను స్థానికంగా తయారుచేస్తున్నది. త్వరలో ఐఫోన్ 13 ఈ లిస్ట్‌లో చేరనుంది. అయితే, ప్రస్తుతానికి ఐఫోన్ల తయారీపైనే దృష్టిపెట్టిన కంపెనీ ధరలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
స్థానిక కస్టమర్ల కోసం భారత్‌లో ఐఫోన్ 13ను తయారు చేస్తామని ఆపిల్ చెబుతోంది. ఈ క్రమంలో భారత్‌లో ఉత్పత్తి చేసిన యూనిట్లు ఇతర మార్కెట్‌లకు ఎగుమతి అయ్యే అవకాశం లేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, ఐఫోన్ 13ను స్థానికంగా ఉత్పత్తి చేయాలనే నిర్ణయాన్ని ఆపిల్ గత ఏడాది సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. భారత్‌లో ఐఫోన్ 12 ఉత్పత్తి ప్రారంభించిన 8 నెలల తర్వాత ఈ ఐఫోన్ 13 ఫోన్ల ఉత్పత్తి ప్రారంభమైంది. కొత్త ఐఫోన్ మోడళ్లను స్థానిక తయారీతో ఆపిల్ వాల్యూమ్‌ను పెంచాలని యోచిస్తోంది. కస్టమర్‌లను ఆకర్షించేందుకు ఆఫర్‌లు, డీల్, ఐఫోన్‌లను అందించనుంది. ఇక, గత ఏడాదిలో ఆపిల్ ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటిగా అవతరించింది. ఐఫోన్ షిప్‌మెంట్‌లు 5 మిలియన్ యూనిట్లతో రికార్డు స్థాయిలో 108 శాతం వృద్ధి చెందాయి. అంటే సుమారుగా 4 శాతం మార్కెట్ వాటాను అందించాయి. పెగట్రాన్‌లో ఐఫోన్ 13 ఉత్పత్తి, ఐఫోన్ 12 ఉత్పత్తితో, ఆపిల్ ఇండియాలోనే ఐఫోన్ అమ్మకాలలో ప్రస్తుత రికార్డును అధిగమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.