Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్ మే సవాల్: ‘ఫ్యూచర్‌’ వాటా కొనుగోలుపై అమెజాన్‌ ఫోకస్!


దేశీయ మార్కెట్లో పట్టు సాధించాలని అమెరికా ఈ - కామర్స్ దిగ్గజం అమెజాన్ తలపోస్తోంది. తద్వారా వాల్ మార్ట్, దేశీయంగా త్వరలో మార్కెట్లో అరంగ్రేటం చేయనున్న రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్’తోనూ తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఫ్యూచర్ రిటైల్ చైన్ సంస్థ నుంచి 8-10 శాతం వాటాల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ డీల్‌ విలువ రూ.2,000 కోట్లు ఉంటుందని అంచనా. కొద్ది వారాల్లో డీల్‌ కొలిక్కి వచ్చే చాన్స్‌ ఉందని తెలుస్తున్నది.

Amazon.com nears deal for up to 10% of Future Retail
Author
New Delhi, First Published Aug 14, 2019, 10:33 AM IST

న్యూఢిల్లీ: భారత రిటైల్‌ చైన్‌ దిగ్గజం ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు అమెరికా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సన్నాహాలు చేస్తోంది. కిశోర్‌ బియానీ సారథ్యంలోని ఫ్యూచర్‌ రిటైల్‌లో 8-10 శాతం వాటాలను చేజిక్కించుకునేందుకు ఇప్పటికే అమెజాన్‌ చర్చలు కూడా ప్రారంభించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాల కథనం. 

అమెజాన్-ఫ్యూచర్ మధ్య జరుగుతున్న చర్చల డీల్‌ విలువ సుమారు రూ.2,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. వచ్చే కొద్ది వారాల్లో ఈ డీల్‌ కొలిక్కి రావచ్చని అంచనా వేస్తున్నారు. హోల్డింగ్‌ కంపెనీ ద్వారా ఈ వాటాలను విక్రయించే అవకాశం ఉందని వారంటున్నారు. 

అమెజాన్ సంస్థకు తమ వాటాల విక్రయంపై మాట్లాడేందుకు ఫ్యూచర్‌ రిటైల్‌ నిరాకరించింది. 
భారతీయ మార్కెట్లో స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు ఈ డీల్‌ ఎంతో దోహద పడుతుందని అమెజాన్‌ భావిస్తోంది. ఆన్‌లైన్‌ విభాగంలో అమెజాన్‌ ఇప్పటికే దేశీయ మార్కెట్లో మెజారిటీ వాటాను దక్కించుకున్న సంగతి విదితమే.

ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా కొనుగోలు విషయమై ఇరు సంస్థల మధ్య కొద్ది నెలలుగా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఈ-కామర్స్‌ మార్కెట్‌ ప్లేసెస్‌కు సంబంధించి ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేయటంతో డీల్‌కు బ్రేకులు పడ్డాయని పేర్కొన్నారు. 

ఎఫ్‌డీఐ నిబంధనలకు సంబంధించి తుది దశ మార్గదర్శకాలు ఖరారు కావటంతో మళ్లీ ఇరు సంస్థలు చర్చలు మొదలుపెట్టాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి ఫ్యూచర్‌ రిటైల్‌లో ప్రమోటర్‌, ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీలకు 47.02 శాతం వాటా ఉంది. 

బిగ్‌ బజార్‌, ఈజీడే, ఫుడ్‌హాల్‌, హైపర్‌సిటీ, ఎఫ్‌బీబీ, హెరిటేజ్‌ ఫ్రెష్‌, ఈ-జోన్‌, డబ్ల్యుహెచ్‌ స్మిత్‌ బ్రాండ్లతో హైపర్‌ మార్కెట్‌, సూపర్‌ మార్కెట్‌ చైన్లను ఫ్యూచర్‌ రిటైల్‌ నిర్వహిస్తోంది. దేశీయంగా 400 నగరాల్లో 2,000 స్టోర్లకు పైగా ఫ్యూచర్‌ రిటైల్‌ నిర్వహిస్తోంది.
 
అమెజాన్‌ ఇప్పటికే షాపర్స్‌ స్టాప్‌, మోర్‌ స్టోర్లలో వాటాలను కలిగి ఉంది. తాజాగా ఆ జాబితాలోకి మూడో సంస్థగా ఫ్యూచర్‌ రిటైల్‌ వచ్చి చేరనుంది. 2017లో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా అమెజాన్‌ డాట్‌కామ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ ఎల్‌ఎల్‌సీ నుంచి షాపర్స్‌ స్టాప్‌ రూ.179.26 కోట్లు సమీకరించింది. ఇది ఆ సంస్థలో 5 శాతం వాటాలకు సమానం.

కాగా గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన మోర్‌ రిటైల్‌ చైన్ హస్తగతం చేసుకున్న విట్‌జిగ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌లో అమెజాన్‌ పెట్టుబడులు పెట్టింది. దీంతో మోర్‌ రిటైల్‌లో అమెజాన్‌కు వాటా లభించింది.

అమెరికా రిటైల్‌ సంస్థ వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌, ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రతిపాదిత ఈ-కామర్స్‌ వెంచర్‌కు గట్టిపోటీని ఇచ్చేందుకు ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా కొనుగోలు ఎంతగానో ఉపయోగపడుతుందని అమెజాన్‌ భావిస్తోంది. అంతేకాకుండా బ్రిక్‌ అండ్‌ మోర్టార్‌ చైన్‌, ఆన్‌లైన్‌లో కార్యకలాపాలను పటిష్ఠం చేసే అవకాశం లభిస్తుందని అంచనా వేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios