భారత్​లో 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు టెలికాం దిగ్గజాలు ఎయిర్​టెల్, జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలు టెలికాం శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం 5జీ ట్రయల్స్​ కోసం హువావే, జెడ్​టీఈ, ఎరిక్సన్​, నోకియా సంస్థలతో ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

దేశీయ టెలికం సంస్థలకు దిక్సూచీగా ఉన్న రిలయన్స్ జియో సంస్థ దక్షిణ కొరియా టెక్ మేజర్ శామ్‌సంగ్​తో చేతులు కలిపినట్లు తెలిసింది.
కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్ గత నెలలో.. ప్రభుత్వం ట్రయల్స్ నిర్వహించేందుకు టెలికాం సంస్థలకు 5జీ సిగ్నల్స్​ను అందివ్వనున్నామని తెలిపారు. 

ఈ ట్రయల్​కు ఉపకరణాలు అందించే సంస్థలపై ఎలాంటి అంక్షలు లేవని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఆంక్షలు ఎదుర్కొంటున్న హువావేకు ఊరటనిచ్చినట్లయింది. ఇది 5జీ ట్రయల్స్​కు మరింత సానుకూలతలు పెంచింది.

అమెరికా మిత్ర దేశాలు ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు హువావేను నిషేధించగా, అదే బాటలో కెనడా, న్యూజిలాండ్ పయనించాయి. రష్యా, ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, టర్కీ, సౌదీ అరేబియా దేశాలు మాత్రం హువావేను స్వాగతించాయి. 

టెలికాం రంగంలో చైనా సంస్థల సేవల వినియోగానికి చాలా దేశాలు అవకాశం ఇచ్చాయి. ఇప్పుడు భారత్​ కూడా.. అదే విధానాన్ని పాటిస్తూ ఏ సంస్థయినా 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతినిచ్చింది.
అన్ని కుదిరితే ఈ నెలాఖరు నుంచి మార్చిలోపు టెలికాం సంస్థలు 5జీ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉంది. 

ఈ విషయంపై సెల్యూలార్​ ఆపరేటర్స్​ అసోసియేషన్ ఆఫ్​ ఇండియా (సీఓఏఐ) డీజీ రాజన్​ మాథ్యూస్​ స్పందిస్తూ.. జాతీయ డిజిటల్​ సమాచార విధానాన్ని అమలు చేసేందుకుగానూ.. 5జీ ట్రయల్స్ ప్రతిపాదనను డీఓటీ ముందు ఉంచడం ఆనందంగా ఉన్నట్లు తెలిపారు.

అయితే భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సంస్థలు 5జీ ట్రయల్స్ ప్రారంభించే విషయమై నోరు మెదపడం లేదు. గతేడాది జూన్ నెలాఖరుకల్లా హువావే 50కి పైగా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది. వీటిలో యూరప్ 28, పశ్చిమాసియాలో 11, ఆసియా పసిఫిక్ రీజియన్ పరిధిలో ఆరు, దక్షిణ అమెరికాలో నాలుగు, ఒక ఆఫ్రికా దేశంతో హువావే జత కట్టింది.

Also Read ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో జియో.. ఎయిర్‌టెల్ కూడా...

హువావే ఇండియా సీఈఓ జయ్ చెన్ స్పందిస్తూ భారత టెలికం రంగాన్ని పునర్జీవింపజేసేందుకు తమ సంస్థ సాధించిన టెక్నాలజీ ఇన్నోవేషన్స్, అత్యున్నత నాణ్యతతో కూడిన నెట్ వర్క్ అందిస్తుందని అన్నారు. 

భారతదేశంలో 5జీ డ్రైవ్ ముందుకు తీసుకు వెళుతుందని తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం భారతదేశ టెక్నాలజీ రంగానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుస్తామని చెప్పారు. 

చైనా టెలికం మేజర్ హువావే భారతదేశంలో టెలికం ప్రొవైడర్లు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలతో కలిసి దేశ రాజధాని ఢిల్లీతోపాటు బెంగళూరు నగర పరిధిలో 5జీ ట్రయల్స్ నిర్వహించనున్నది. ఈ మేరకు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కేంద్ర టెలికం శాఖకు సమర్పించిన దరఖాస్తుల్లో పేర్కొన్నాయని సమాచారం. 

గత నెల 31న భారతదేశంలో 5జీ ట్రయల్స్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ లోగా టెలికం ప్రొవైడర్లు ‘5జీ ట్రయల్స్’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. దీనిపై హువావే స్పందించడానికి నిరాకరించింది.