న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజం ‘ఆపిల్’ తయారుచేసిన ‘ఐఫోన్’ల విక్రయాల్లో పరస్పర విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 26 బిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదించింది. గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 12 శాతం తగ్గుదల నమోదైంది. 

కానీ భారతదేశంలో మాత్రం ఐఫోన్ల విక్రయాలు 19 శాతం పెరిగాయి. ఆపిల్ ‘ఐఫోన్ల’ విక్రయాలు 11 శాతం తగ్గాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ కంపెనీ ఆర్థిక ఫలితాలు తమను ప్రోత్సహించాయని చెప్పారు. 

జనవరిలో చెప్పిన మేరకు తీసుకున్న చర్యలతోపాటు వినియోగదారుల నుంచి సమర్థవంతమైన ప్రతిస్పందన వచ్చిందని టిమ్ కుక్ పేర్కొన్నారు. రిటైల్, ఆన్ లైన్ సేల్స్‌లో 17 శాతం అభివ్రుద్ధి సాధించి గణనీయ పురోగతి నమోదు చేసిందని టిమ్ కుక్ తెలిపారు. 

తమ యాక్టివ్ ఇన్‌స్టాల్డ్ బేస్ ‘ఐఫోన్’ 20 మార్కెట్లలో నూతన శిఖరాలకు చేరుకున్నదని టిమ్ కుక్ చెప్పారు. ‘ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సంత్రుప్తికరంగా నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నాం’ టిమ్ కుక్ చెప్పారు.