సారాంశం
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. లావా యువ2 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఆకట్టుకునే మార్బుల్ ఫినిష్‌తో అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ భారత స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకురావడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్లను తీసుకొస్తుంటుందీ కంపెనీ. ఈ నేపథ్యంలో లావా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. లావా యువ 2 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇప్పటికే లావా రిటైల్ స్టోర్స్ ద్వారా అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
లావా ఈ ఫోన్‌ను స్టైలిష్ లుక్‌తో తీసుకొచ్చింది. మార్బుల్ ఫినిషింగ్‌తో యువతను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌ను కేవలం 4 జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,499గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను మార్బుల్ బ్లాక్, మార్బుల్ వైట్ కలర్స్‌లో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేశారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే ఈ ఫోన్‌పై కంపెనీ డిస్కౌంట్ అంందిస్తోంది
తక్కువ బడ్జెట్ లో..
ఇక తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్ కోసం చూస్తున్న వారికి లావా యువ 2 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 700 నిట్స్ బ్రైట్‌నెస్, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. కాగా ఈ ఫోన్‌లో యూనిసోక్ టీ76 ప్రాసెసర్‌ను అందించారు. దీంతో ఈ ఫోన్ ఎలాంటి అవంతరాలు లేకుండా పనిచేస్తుంది.
కెమెరా విషయానికొస్తే..
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా సెటప్‌ను అదిచారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. అలాగే ఏవైనా నోటిఫికేషన్స్ వస్తే కెమెరా చుట్టూ ఉన్న లైట్ బ్లింక్ అయ్యే ఆప్షన్‌ను ఇందులో అందించారు. ఇక బ్యాటరీ పరంగా చూస్తే ఇందులో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఇంటి వద్దే సర్వీసింగ్..
ఈ స్మార్ట్ ఫోన్‌ను డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో తీసుకొచ్చారు. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్- సి పోర్ వంటి ఫీచర్లను అందించారు. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో సర్వీస్‌కు సంబంధించి లావా ప్రత్యేక వెసులుబాటులను కల్పించారు. ఒకవేళ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత ఏడాదిలోగా ఏవైనా సమస్యలు వస్తే సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా నేరుగా ఇంటికి వచ్చే సర్వీస్ చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.