తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గాను ఆకర్షణీయ హామీలు ఇస్తున్నాయి. అయితే పక్క పార్టీ కంటే ఏందులోనూ తగ్గకూడదనే ఉద్దేశ్యంతో నేతలు ఇస్తున్న హామీలు కోటలు దాటుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాలు, గృహిణులకు నెలవారీ సాయం, ఉచిత ఇళ్లు, నీట్ రద్దు, మద్యం దుకాణాల మూత వంటి హామీలతో ప్రధాన పార్టీలు ఊదరగొడుతున్నాయి.

ఈ క్రమంలో ద్రవిడ మున్నేట కళగం (డీఎంకే) అభ్యర్థి సెంథిల్ బాలాజీ మరో అడుగు ముందుకు వేసి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నిమిషాలకే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తామంటూ వాగ్దానం చేశారు. కరూర్ నియోజకవర్గం నుంచి సెంథిల్ బాలాజీ పోటీ చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఎంకే అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తామని బాలాజీ వెల్లడించారు. స్టాలిన్ సీఎంగా ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తే, 11.05 నిమిషాలకల్లా మీరు నేరుగా మీ ఎద్దుల బండితో నదికి వెళ్లి ఇసుక తవ్వుకోవచ్చంటూ ఆయన హామీ ఇచ్చారు.

అధికారులెవరూ మిమ్మల్ని అడ్డుకోరని.. అలా ఎవరైనా జోక్యం చేసుకుంటే తనకు ఫోను చేయండంటూ పిలుపునిచ్చారు. సంబంధిత అధికారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తామని సెంథిల్ బాలాజీ స్పష్టం చేశారు.