ఇప్పుడే ప్రకటించిన రిపబ్లిక్- సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చింది. ప్రస్తుత పళనిస్వామి ప్రభుత్వానికి ఓటమి ఖాయమని బల్ల గుద్ది ప్రకటించింది. ఉన్న మొత్తం సీట్లలో డీఎంకే కూటమి 160-170 సీట్లను సాధించి అధికారం హస్తగతం చేసుకుంటుందని సర్వే పేర్కొంది. అధికార అన్నాడీఎంకే- బీజేపీ కూటమికి 58 నుంచి 68 స్థానాలు లభిస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. 

మరో మూడు రాష్ట్రాలు, మరొక కేంద్రపాలీత ప్రాంతాలతో కలిపి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే దఫాలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అనేక పార్టీలు బరిలో ఉన్నప్పటికీ... ప్రధానంగా పోరు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే ల మధ్యనే నెలకొని ఉంది. 

డీఎంకే కాంగ్రెస్ తో జతకట్టి బరిలో దిగగా, అన్నా డీఎంకే బీజేపీతో జతకట్టి బరిలోకి దిగింది. డీఎంకే, అన్నాడీఎంకేల అధినేతలు కరుణానిధి, జయలలితలు లేకుండా ఆ పార్టీలు ఎదుర్కుంటున్న తొలి ఎన్నికలు ఇవే..!కమలహాసన్, టీటీవి దినకరన్ కి చెందిన పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ... వారి ప్రభావం నామమాత్రంగానే ఉండబోతున్నట్టుగా ముందు నుండే ఒపీనియన్ పోల్స్ పేర్కొన్నాయి. 

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమిళనాడు అంతటా గెలుపుబావుటా ఎగురవేసింది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్ లో కూడా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 155 నుండి 177 సీట్ల వరకు సాధించి దక్కించుకుంటుందని పేర్కొనగా, అధికార అన్నాడీఎంకే మాత్రం 22 నుండి 83 సీట్ల వరకు సాధిస్తుందని పేర్కొన్నాయి. ఈ దఫా ఎన్నికల్లో నిజమైన విజేత ఎవరో తేలాలంటే మాత్రం మే 2వ తేదీ వరకు ఆగాల్సిందే..!