తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అల్లుడు శబరీశన్‌ నివాసంలో ఆదాయ పన్నుశాఖ శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది.

నీలంగరాయ్‌లోని శబరీశన్‌ నివాసంతో పాటు చెన్నైలో ఆయనకు సంబంధించిన మరో మూడు ఆఫీసుల్లో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న డీఎంకే కార్యకర్తలు, మద్దతుదారులు శబరీశన్ నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు.

కాగా, స్టాలిన్ ఎన్నికల కోర్ కమిటీలో శబరీశన్ కీలక వ్యూహకర్తగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఆస్తులు ఒక్కసారిగా ఎలా పెరిగాయని స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రశ్నించిన మర్నాడే శబరీశన్ నివాసంలో దాడులు జరగడం గమనార్హం. కోయంబత్తూరు సమీపంలోని గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే నేతల నివాసాల్లో ఐటీ దాడులు జరగడం ఇది రెండోసారి. గత నెలలో ఆ పార్టీ సీనియర్‌ నేత ఈవీ వేలు నివాసంలో ఆదాయ పన్ను అధికారులు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది.

వేలు నివాసం సహా ఆయన కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మొత్తం 10 చోట్ల సోదాలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో నగదు ప్రవాహం జరగుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. వే

లు నివాసంలో భారీ మొత్తంలో నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, తమపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ దాడులకు పాల్పడుతున్నారని డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆరోపిస్తున్నారు.

నగదు లేనప్పటికీ ఉద్దేశపూర్వకంగా సోదాలు నిర్వహిస్తున్నారని, ఇటువంటి చర్యలు తమ విజయాన్ని అడ్డుకోలేవని ఆ పార్టీ నేత దురైమురుగన్ మండిపడ్డారు.