తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.

ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి జయలలితపై డీఎంకే అధినేత స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అన్నాడీఎంకే మండిపడింది. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ ఏఐఏడీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులపై ఓవైపు జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో స్టాలిన్, ఉదయనిధి ఆమెపై వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని అన్నాడీఎంకే తన ఫిర్యాదులో పేర్కొంది.

డీఎంకే నేతలు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల్లో విద్వేషాలు కలిగించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని అధికార పార్టీ ఆరోపించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నందున స్టాలిన్, ఉదయనిధిలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.