ఐపీఎల్ 2019 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో యువరాజ్ సింగ్ ని చివరి నిమిషంలో ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. గతంలో రూ.16కోట్లు పలికిన యువరాజ్ సింగ్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయాడని.. అతనిని అన్ని ఫ్రాంఛైజీలు పక్కనపెట్టేశాయి. ముంబయి  ఇండియన్స్ మాత్రం చివరల్లో రూ.1కోటికి యూవీని దక్కించుకుంది.

అయితే.. తాను ఇంకా ఫామ్ లోనే ఉన్నానని నిరూపించాడు ఈ మాజీ క్రికెటర్. యూవీ ప్రస్తుతం రంజీ ట్రోఫీలోని పంజాబ్ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు యూవీ గుర్తుండిపోయే ఇన్నింగ్ ని మాత్రం ఆడలేకపోయాడు. కానీ.. ఇప్పుడు తిరిగి ఫామ్ సంపాదించుకున్నాడు.

డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్ లో 57బంతుల్లో 80 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీ, ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్ యూవీకి బాగా కలిసొచ్చింది. ఎయిర్ ఇండియా 12పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన యూవీ.. తన బ్యాటింగ్ సత్తాని చూపించాడు. 57 బంతుల్లో 80 పరుగులు చేసి తన ఖాతాలో హాఫ్ సెంచరీ వేసుకున్నాడు. జట్టు కీలక స్కోర్ చేయడానికి కూడా సహకరించాడు. దీంతో.. అందరూ యువీ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.