భారత రెజ్లర్ దీపక్ పూనియా మరో అరుదైన ఘనత సాధించాడు. ఇటీవలే కజకిస్థాన్ వేదికన జరిగిన వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ లో రజతంతో మెరవడమే కాదు టోక్యో ఒలింపిక్స్ కు కూడా అర్హత సాధించిన విషయం తెలిసిందే. తాజాగా రెజ్లింగ్ వరల్డ్ ర్యాకింగ్స్ లో టాప్ లేపి ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడిగా నిలిచాడు. 86 కిలోల విభాగంలో దీపక్ ఈ ఘనత సాధించాడు. 

అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య విభాగాల వారిగా ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ప్రకటించింది. అందులో 86 కిలోల విభాగంలో దీపక్ కు 82 పాయింట్లు లభించాయి. దీంతో అతడు నెంబర్ వన్ గా నిలిచాడు. కేవలం 20ఏళ్ల ప్రాయంలోనే దీపక్ ఈ ఘనత సాధించడం విశేషం. 

ఇదే  విభాగంలో ఇరాన్ ఆటగాడు హసన్ 78 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచాడు. విశేషమేంటంటే హసన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ లో గోల్డ్ సాధించగా దీపక్ రజతంతో సరిపెట్టుకున్నాడు. కానీ ర్యాంకింగ్స్ లో దీపక్ టాప్ లో నిలవగా హసన్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. 

ఇక 65 కిలోల పురుషుల విభాగంలో  యోగేశ్వర్ దత్ టాప్ ర్యాంక్ ను కోల్పోయి రెండో స్థానానికి పరిమితమయ్యాడు. మహిళల 53 కిలోల విభాగంలో వినేశ్ పోగట్ రెండో ర్యాంక్ తో సరిపెట్టుకుంది.