అత్యంత అదునాతన సదుపాయాలతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా భారత దేశంలో ఓ భారీ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణం అందుకు వేదికైంది. సబర్మతి నదీతీరాన వున్న మొతెరా స్టేడియం స్థానంలో భారీ క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమల్ నథ్వానీ వెల్లడించారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వున్న మెల్ బోర్న్ స్టేడియం ప్రపంచంలో అతిపెద్దది. అందులో ఒకేసారి దాదాపు 92 వేలమంది ప్రేక్షకులు కూర్చుని మ్యాచ్ చూడొచ్చు. అయితే అంతకంటే ఎక్కువ ప్రేక్షకుల సామర్థ్యంతో పాటు విశాలంగా వుండేలా మొతెరా స్టేడియాన్ని పునర్ నిర్మిస్తున్నట్లు నథ్వానీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గతంలోనే ప్రారంభమైన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ట్వీట్ చేశారు.

ఈ స్డేడియ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలతో పాటు నిర్మాణ పనులను పరిశిలిస్తున్న ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కలల ప్రాజెక్టైన మొతెరా స్టేడియం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా నిలిచి యావత్ దేశానికి గర్వకారణంగా నిలవనుందంటూ నథ్వానీ ట్వీట్ చేశారు.