ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య సెయింట్ లూయిస్‌లో ముగిసిన మూడో టెస్టు వివాదంతో పాటు ఓ చెత్త రికార్డును సైతం మూటకట్టుకుంది. ఈ టెస్టులో ఇరు జట్ల బౌలర్లు కలిసి 38 వైడ్లు విసిరారు. దీంతో అత్యధిక వైడ్ల చెత్త రికార్డు బద్దలైంది.

ఆట నాలుగో రోజు విండీస్ బౌలర్ కీమర్ రోచ్ వేసిన ఐదో బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించడంతో గత వైడ్ల రికార్డు సమమైంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో వైడ్ వేశాడు. ఫలితంగా 35 వైడ్లతో చెత్త రికార్డు నమోదైంది.

ఆ తర్వాత ఇంగ్లీష్ బౌలర్లు మరో మూడు  వైడ్లు వేయడంతో మొత్తంగా ఈ మ్యాచ్‌లో 38 వైడ్లు  పడ్డాయి. గతంలో 2008 జూన్‌లో వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిడ్జిటౌన్ వేదికగా జరిగిన టెస్టులో ఇరు జట్లు ఆటగాళ్లు కలిపి మొత్తం 34 వైడ్లు విసిరారు.

ఇదే ఇప్పటి వరకు అత్యధిక వైడ్ల చెత్త రికార్డు. ఆ తర్వాతి స్థానంలో 33 వైడ్లతో భారత్-దక్షిణాఫ్రికా జట్లు నిలిచాయి. కాగా, ఇదే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్‌ను ‘గే’గా పేర్కొంటూ, వెస్టిండీస్ క్రికెటర్ షెనాన్ గాబ్రియెల్ వ్యాఖ్యానించడంతో అతనిపై ఐసీసీ కన్నెర్ర చేసింది. ఇందుకు గాను గాబ్రియెల్‌పై నాలుగు వన్డేల నిషేధాన్ని విధించింది. 

గే వివాదం.. విండీస్ క్రికెటర్ పై నిషేధం