ప్రపంచ క్రికెట్‌లోని విధ్వంసక ఆటగాళ్లలో ఒకడైన వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌‌మెన్ క్రిస్‌గేల్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది జరగనున్న  ప్రపంచకప్‌తో వన్డే కెరీర్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

1999 సెప్టెంబర్‌లో భారత్‌పై టొరంటోలో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన గేల్... 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులు, మైలు రాళ్లతో విండీస్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

103 టెస్టుల్లో 7,215 పరుగులు, 284 వన్డేల్లో 9,727 పరుగులు, 56 టీ20లలో 1,607 పరుగులు చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఏకైక విండీస్ క్రికెటర్‌గా, బ్రియాన్ లారా తర్వాత అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా గేల్ రికార్డుల్లోకి ఎక్కాడు.

వెస్టిండీస్ బోర్డుతో విభేదాల కారణంగా జాతీయ జట్టులో ఆడటాన్ని తగ్గించేసిన క్రిస్ ‌గేల్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లలో పాల్గొన్నాడు. పొట్టి క్రికెట్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌లతో ఈ ఫార్మాట్‌లో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. గతేడాది జూలైలో వన్డేల సిరీస్ ఆడిన గేల్... ఇప్పుడు ఇంగ్లాండ్‌తో ఆడుతున్నాడు.