అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు వెస్టీండిస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. అంతర్జాతీయంగా  జరిగే అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు బ్రావో స్పష్టం చేశాడు.  

2004 లో విండీస్ జట్టులో స్థానం పొందిన బ్రావో ఇప్పటివరకు 40 టెస్టులు, 164 వన్డేలు, 66 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే పేలవమైన ఆటతీరుతో గత రెండేళ్లుగా అతడు విండీస్ జట్టులో స్థానం కోల్పోయాడు. 2016 సెప్టెంబర్లో పాక్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో చివరిసారిగా విండీస్‌ తరపున ప్రాతినిధ్యం వహించాడు. బ్రావో చివరి వన్డే 2014 భారత్ తో ఆడగా, చివరి టెస్ట్ 2010 శ్రీలంకతో ఆడాడు. 2016 లో జరిగిన టీ20 లో బ్రావో జట్టులో కీలకంగా వ్యవహరించాడు. 

రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా బ్రావో ఉద్వేగంగా మాట్లాడాడు. జూలై 2004 లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మొదటిసారి విండీస్ జట్టులో చోటుసాధించిన క్షణాలు, మెరూన్ క్యాప్ అందుకున్న జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయని అన్నారు. యువతరం క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం కోసమే రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఈ 35ఏళ్ల ఆటగాడు ప్రకటించాడు. కానీ ప్రొఫెషనల్‌ కెరీర్‌ను యదావిధిగా కొనసాగిస్తానని బ్రేవో తెలిపాడు.