ఐదు వన్డేల సీరీస్ లో భాగంగా బుధవారం వైజాగ్ లో జరిగిన రెండో వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. టీంఇండియా నిర్దేశించిన 322 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ చేదించినంత పని చేసి చివరకు టైతో సరిపెట్టుకుంది. అయితే వైజాగ్ లో మిగతా జట్లపై  తిరుగులేని ఆదిక్యాన్ని ప్రదర్శించే భారత జట్టు విండీస్ జట్టుతో మాత్రం ఆ ఆటతీరు కనబర్చలేకపోతోంది. 

భారత జట్టుకు విశాఖ పట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో తిరుగులేని రికార్డుంది. ఇప్పటివరకు ఈ స్టేడియంలో జరిగిన ఒకే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ లో తప్ప మిగతా అన్నింటిలోనూ భారత్ దే విజయం.  ఆ ఒక్క ఓటమి కూడా విండీస్ జట్టుతోనే కావడం విశేషం.

ఈ స్టేడియంలో మొట్టమొదటి మ్యాచ్ 2005 లో భారత్ జట్టు పాకిస్థాన్ తో తలపడింది. దాయాదుల మధ్య రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో విజయం మాత్రం భారత్ నే వరించింది. ఆ తర్వాత 2007 శ్రీలంకతో, 2010 లో ఆస్ట్రేలియా, 2011 వెస్టిండీస్ తో వరుసగా విజయాలు సాధించింది. అయితే వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ కు 2013 లో ఇదే విండీస్ జట్టు షాకిచ్చింది. రెండు వికెట్ల తేడాతో గెలిచి వైజాగ్ స్టేడియంలో భారత విజయాల రికార్డుకు బ్రేకులు వేసింది. 

ఈ మ్యాచ్ తర్వాత మళ్లీ 2016  న్యూజిలాండ్, 2017 శ్రీలంకతో జరిగిన వన్డేల్లో భారత్ వరుసగా విజయాలు సాధించింది. ఆ తర్వాత మళ్లీ బుధవారం విండీస్ తో తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి విండీస్ పై ప్రతీకారం తీర్చుకుని యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని ప్రేక్షకులు భావించారు. అయితే ఈ మ్యాచ్ టైగా ముగించి విండీస్ గెలవకపోయినా మరోసారి వైజాగ్ లో టీంఇండియా విజయాలకు బ్రేకులు వేసింది. 

ఇలా 2013 లో ఈ గ్రౌండ్ లో వెస్టిండిస్ చేతిలో  ఓటమిపాలై మరోసారి ఇలా నిన్నటి మ్యాచ్లో టైతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో విండీస్ జట్టుతో తలపడేపుడు మాత్రమే భారత్ కు వైజాగ్ కలిసిరావడం లేదని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.