ఆసిస్ గడ్డపై విజయ పరంపర మోగించిన టీం ఇండియాకి.. సొంత గడ్డపై ఎదురు దెబ్బ తగిలింది. ఆదివారం విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో టీం ఇండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఓటమిపాలవ్వడానికి గల అసలు కారణాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించాడు.

బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయాం అని కోహ్ల తెలిపాడు. తమ బౌలర్ల పోరాటం చూస్తే చాలా గర్వంగా ఉందన్నారు. తాము  ఈ మ్యాచ్‌ను ఇంత వరకు లాక్కొస్తామని అస్సలు ఊహించలేదని కోహ్లీ చెప్పాడు.  బుమ్రా అద్భుతం చేశాడని.. మయాంక్‌ కూడా బాగా బౌలింగ్‌ చేశాడని చెప్పాడు.

 తొలి మ్యాచ్‌ను అందిపుచ్చుకోలేకపోయామన్నాడు. 15వ ఓవర్‌ వరకు పిచ్‌ బ్యాటింగ్‌కు ఏ మాత్రం సహకరించలేదని.. అందుకే  తాము బ్యాటింగ్‌లో వైఫల్యం చెందామన్నారు. టీ20ల్లో తక్కువ స్కోర్లతో నెగ్గడం చాలా కష్టమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 

 ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా రాహుల్‌, పంత్‌లకు అవకాశం కల్పించామని చెప్పాడు. రాహుల్‌ అద్భుతంగా ఆడాడని.. అతడితో తాను  మంచి భాగస్వామ్యం కూడా నెలకొల్పానని చెప్పుకొచ్చాడు.  ఈ పిచ్‌పై 150 పరుగులు చేసుంటే గెలిచేవాళ్లమని.. కానీ తమ  కంటే అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆసీస్‌ ఆటగాళ్లు ఈ విజయానికి అర్హులు అని కోహ్లి అభిప్రాయపడ్డాడు.