ఉద్విగ్న భరితక్షణాలు : వందేమాతరంతో మారుమోగిన వాంఖడే.. ఒకేసారి 32వేలమంది ఆలాపన...
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో గెలిచి భారత్ ప్రపంచ కప్ ఫైనల్‌లో స్థానం సంపాదించడంతో ఏర్పడిన ఉద్విగ్న భరితమైన వాతావరణం ఇలా ఆవిష్కరించబడింది.
ముంబై : వాంఖడే స్టేడియం మరో రికార్డుకు వేదికయ్యింది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైనల్ లో భారత్ ఘన విజయం సాధించి, ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. కొత్త రికార్డులతో మోత మోగించింది. ఈ వరుసలోనే మరో అపురూపమైన ఘటన జరిగింది. వాంఖడే స్టేడియంలో 32,000 మందికి పైగా ఉన్న క్రికెట్ అభిమానులు ముక్తకంఠంతో.. ఏకకాలంలో వందేమాతర జాతీయ గీతం ఆలపించారు.
దేశభక్తితో రోమాలు నిక్కబొడుచుకున్న సందర్భం అది. సంతోషంతో కూడిన భావోద్వేగంతో కళ్లు వర్షించిన అద్భుతమైన, అపురూపమైన ఘటన అది. మదిలో నిలిచిపోయే మరపురాని దృశ్యం అది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో గెలిచి భారత్ ప్రపంచ కప్ ఫైనల్‌లో స్థానం సంపాదించడంతో ఉద్విగ్న భరితమైన వాతావరణం ఇలా ఆవిష్కరించబడింది.
వాంఖడే స్టేడియం సంబరాల్లో ఉవ్వెత్తున ఎగసిపడింది. దేశం మీద ఉన్న ప్రేమతో..అఖండ భారతం ఒక్కటేనన్న స్ఫూర్తిని ఈ ఐక్యతారాగం ప్రతిబింబిస్తుంది.
ది మెన్ ఇన్ బ్లూ ఫైనల్స్‌కు చేరుకుంది. 2019 ప్రపంచ కప్‌లో చోటు కోల్పోయినందుకు ప్రతీకారం తీర్చుకున్న మార్గంగా అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత భారత్ క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. కివీస్ ఇంటిదారి పట్టింది. మహ్మద్ షమీ తన ఏడు వికెట్లతో భారత్‌కు అద్భుతవిజయాన్ని అందించి, అజేయంగా నిలిచాడు. షమీ జెర్సీ వెనుక కూడా నం.7 స్క్రిప్ట్ ఉండటానికి అర్హుడు.
నాల్గవ సారి, భారత్ విజయవంతంగా ODI ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది, గతంలో 1983, 2011లో ట్రోఫీని కైవసం చేసుకుంది. 2003లో భారత్ రన్నరప్‌గా నిలిచింది. టైటిల్ పోరులో ప్రత్యర్థి ఎవరన్నది గురువారం వెల్లడి కానుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.