విరాట్ కోహ్లీకి మరోసారి ప్రతిష్టాత్మక అవార్డు

Virat Kohli set to receive Polly Umrigar award
Highlights

పాలీ ఉమ్రిగర్ అవార్డును సొంతం చేసుకున్న కోహ్లీ

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. వరుసగా నాలుగో ఏడాది కూడా బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్‌కు బీసీసీఐ ఇచ్చే పాలీ ఉమ్రిగర్ అవార్డు కోహ్లీని వరించింది. ఈ అవార్డును నాలుగుసార్లు గెలిచిన తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. జూన్ 12న జరగనున్న బీసీసీఐ అవార్డు సెర్మనీలో కోహ్లికి అవార్డు ఇవ్వనున్నట్లు బోర్డు గురువారం వెల్లడించింది.

2006లో తొలిసారి ఈ అవార్డును ప్రవేశపెట్టగా ఆ ఏడాది సచిన్ టెండూల్కర్ దీనిని అందుకున్నాడు. 2007లో సెహ్వాగ్, 2008లో గంభీర్, 2009లో సచిన్, 2010లో ద్రవిడ్, 2011లో విరాట్ కోహ్లి, 2012లో అశ్విన్, 2013లో భువనేశ్వర్‌కుమార్, 2014, 2015లతోపాటు 2016, 2017 ఏడాదిలకు కలిపి మరోసారి కోహ్లి పాలి ఉమ్రిగర్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇక మహిళల టీమ్ విషయానికి వస్తే తొలిసారి ఈ అవార్డును ఇవ్వబోతున్నారు. 2016 సీజన్‌కుగాను హర్మన్‌ప్రీత్ కౌర్, 2017 సీజన్‌కు గాను స్మృతి మందాన ఈ అవార్డు అందుకోబోతున్నారు.

ఇక బీసీసీఐ పాలనలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన దివంగత జగ్మోహన్ దాల్మియా జ్ఞాపకార్థం నాలుగు అవార్డులను బీసీసీఐ ప్రకటించింది. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీని అండర్ 16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన వాళ్లతోపాటు మహిళల క్రికెట్‌లో బెస్ట్ జూనియర్, సీనియర్ ప్లేయర్స్‌కు అందిస్తారు. ఇక 9 కేటగిరీల్లో ప్రైజ్‌మనీని గతంలో ఉన్న లక్ష నుంచి లక్షన్నరకు బీసీసీఐ పెంచింది.

loader