న్యూఢిల్లీ: జీవితం కన్నా క్రికెట్ ముఖ్యం కాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.  ఇంత వరకు క్రికెట్ కోసం ఎంతో సమయాన్ని కేటాయించానని, ఇకపై తన జీవితం కోసం, తన కోసం కేటాయిస్తానని అతను అన్నాడు. ఇప్పుడు తన జీవితంలోకి భాగస్వామి వచ్చిందని  గుర్తు చేస్తూ ఇకపై కుటుంబానికే అత్యధిక సమయం కేటాయించాలని అనిపిస్తోందని అన్నాడు. 

అనుష్కకి, తన కుటుంబానికి సమయం కేటాయించాలని ఉందని కోహ్లీ అన్నాడు. క్రికెట్ తన జీవితంలో ఒక భాగం మాత్రమేనని, జీవితం కంటే మాత్రం ఏదీ ఎక్కువ కాదని అన్నాడు. ఇక మీదట కుటుంబమే తనకు ముఖ్యమని స్పష్టం చేశాడు.
 
అనుష్క తనను అర్థం చేసుకోగలుగుతోంది కాబట్టే విజయాలు సాధించగలుగుతున్నట్టు చెప్పాడు. ఇప్పటి వరకు తన కోసం తాను సమయాన్ని కేటాయించుకోలేకపోయానని, ఇక మీదట అలా జరగదని అన్నాడు.
 
క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోలేకపోతే విజయాలు సాధించలేమని చాలామంది చెబుతున్న దాంట్లో నిజం లేదని అన్నాడు. తన వరకు అది ఎంతమాత్రమూ నిజం కాదని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే తాను చాలా క్రికెట్ ఆడేశానని, నిజానికి అనుకున్నదానికన్నా ఎక్కువే ఆడేశానని అన్నాడు. దీనికి కూడా ఓ ముగింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.