ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ జట్టులో స్థిరమైన స్థానం కోసం పోటీ పడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో కాదు ఈ రెండింటిలోనూ ప్రావీణ్యం కలిగిన ఆలౌ రౌండర్ విభాగంలోనూ ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొని వుంది. 

మరీ ముఖ్యంగా ఇప్పటికే తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అలరిస్తూ తానేంటో నిరూపించుకున్న హర్ధిక్ పాండ్యా, ఇటీవలే అంతర్జాతీయ జట్టులోకి ప్రవేశించిన యువ ఆలౌరౌండర్ విజయ్ శంకర్ లు టీంఇండియాలో స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాండ్యాతో పోటీపై తాజాగా విజయ్ శంకర్ స్పందించాడు. 

హర్ధిక్ పాండ్యా కు తనకు మధ్య పోటీ వున్న మాట నిజమేనని విజయ్ శంకర్ పేర్కొన్నాడు. అయితే అది స్నేహపూర్వక పోటీ మాత్రమేనని...ఒకరికి అవకాశం వస్తే మరోకరు ఈర్ష్యపడే పోటీ కాదన్నారు. బయటినుండే చూసేవారికి, విమర్శకులకు మాత్రమే తమ మధ్య విద్వేషపూరిత పోటీ వున్నట్లు కనిపిస్తుంటుందని శంకర్ ఆరోపించారు. 

ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సీరిస్ తామిద్దరం కలిసి ఆడిన విషయాన్ని శంకర్ గుర్తుచేశారు. ఈ సమయంలో ఇద్దరం కలిసి ఆటతీరు, వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో ఎలా ఆడాలన్న దానిపై చర్చించుకున్నట్లు శంకర్ వెల్లడించారు. తమ  మధ్య కేవలం స్నేహపూర్వక పోటీ మాత్రమే వుందని...బయట తాము మంచి స్నేహితులమని శంకర్ పేర్కొన్నారు. 

 ఎవరు బాగా ఆడితే వారికే మంచి అవకాశాలుంటాయని...అందువల్ల అవకాశాలు రానప్పుడు మన ఆటతీరును మార్చుకోడానికి ప్రయత్నించాలని శంకర్ తెలిపాడు. కానీ ఎదుటి వారిపై ద్వేషాన్ని పెంచుకుని శతృవులుగా భావించరాదని అన్నాడు. భారత జట్టు తరపున ఆడే అవకాశం తనకొచ్చినా, హర్దిక్ పాండ్యా కు వచ్చినా తాను ఆనందిస్తానే గానీ బాధపడనని  విజయ్ శంకర్ అన్నారు.