రష్యాకు  చెందిన ప్రపంచ నంబర్-5  టెన్నిస్ స్టార్ డేనియల్ మెద్వదేవ్ కు భారీ జరిమానా విధించారు. ఆట మధ్యలో ఆయన ప్రవర్తించిన తీరు సరిగా లేని కారణం చేత ఈ జరిమానా విధించారు.  యూఎస్ ఓపెన్ లో ఆయన చేసిన రెండు తప్పులకు రూ.6.5లక్షలు(9వేల డాలర్లు) జరిమానాగా విధించారు.

23 ఏళ్ల మెద్వదేవ్ తొలుత బాల్ బాయ్ చేతుల్లోంచి టవల్‌ను బలవంతంగా లాక్కున్నందుకు 5 వేల డాలర్లు, గ్యాలరీలోని ప్రేక్షకులకు మద్య వేలు చూపించినందుకు 4 వేల డాలర్లు కలిపి మొత్తం 9 వేల డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు. మూడు మ్యాచుల్లో కలిపి మొత్తంగా 19 వేల డాలర్లు (రూ.13.6 లక్షలు) జరిమానాకు గురయ్యాడు.
 
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఫెలిసియానో లోపెజ్‌ను ఓడించి నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించాడు. అనంతరం కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. తొలుత బాల్ బాయ్ నుంచి టవల్ లాక్కుని తొలి తప్పు చేసిన మెద్వదేవ్ ఆ తర్వాత స్టేడియంలోని ప్రేక్షకులకు మధ్యవేలు చూపించి రెండో ఉల్లంఘనకు పాల్పడ్డాడు. మెద్వదేవ్ మధ్యవేలు చూపించడం స్టేడియంలోని వీడియో స్క్రీన్‌పైనా కనిపించింది. దీంతో అతడు జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం మెద్వదేవ్ తన ప్రత్యర్థి లోపెజ్, కోచ్‌లకు క్షమాపణలు చెప్పాడు. అలాగే న్యూయార్క్ ప్రజలను కూడా క్షమాపణ వేడుకున్నాడు.