బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో భాగంగా టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పుజారా సెంచరీ సాధించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

ఈ క్రమంలో 231 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ చేశాడు.. టెస్టుల్లో అతనికిది 16వ సెంచరీ. ఈ నేపథ్యలో పుజారా తన ఖాతాలో అరుదైన రికార్డులను జమ చేసుకున్నాడు. ఆసియా వెలుపుల తొలి రోజు ఆటలో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

ఇంతకు ముందు సంజయ్ మంజ్రేకర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, మురళీ విజయ్‌లు ఉన్నారు. కాగా, కెప్టెన్ కోహ్లీ రెండు సార్లు తొలి రోజు సెంచరీ సాధించాడు. దీనితో పాటు పుజారా మరో అరుదైన ఘనతను సాధించాడు.

టెస్టుల్లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 108 ఇన్నింగ్సుల్లో 5 పరుగులు పూర్తి చేసిన పుజారా అత్యంత వేగంగా ఈ మార్కును చేరిన జాబితాలో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. సునీల్ గావస్కర్ (95), వీరేంద్ర సెహ్వాగ్ (99), సచిన్ (103), విరాట్ కోహ్లీ (105) ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించారు.