Asianet News TeluguAsianet News Telugu

Tokyo Olympics: కాంస్య పతక పోరులో పోరాడి ఓడిన భారత మహిళా హాకీ జట్టు

శుక్రవారం జరిగిన మహిళల హాకీ కాంస్య పతకం పోరులో భారత జట్టు పోరాడి ఓడింది. 4-3 తేడాతో బ్రిటన్ చేతిలో పరాజయంపాలైంది

Tokyo Olympics : India Loses to Great Britain in Women Hockey Bronze Medal Match
Author
Tokyo, First Published Aug 6, 2021, 8:48 AM IST

శుక్రవారం జరిగిన మహిళల హాకీ కాంస్య పతకం పోరులో భారత జట్టు పోరాడి ఓడింది. 4-3 తేడాతో బ్రిటన్ చేతిలో పరాజయంపాలైనప్పటికీ.... భారత మహిళల పోరాటం మాత్రం అద్వితీయమని చెప్పక తప్పదు. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచులో భారత జట్టు చివరి క్షణం వరకు పోరాడింది. 

తొలి క్వార్టర్ ప్రారంభం నుంచే బ్రిటన్ అటాకింగ్ గేమ్ కి తెర తీసి మ్యాచ్ ప్రారంభమైన కొన్ని నిముషాల్లోనే పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని దక్కించుకున్నారు. మరోసారి గోల్ కీపర్ సవిత పూనియా అద్భుతమైన సేవ్ తో బ్రిటన్ కి గోల్ దక్కకుండా చేసింది. మరో 6 నిముషాలు ఉందనగా బ్రిటన్ మరో పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సాధించింది. కాకపోతే బ్రిటన్ దాన్ని సరిగా ట్రాప్ చేయలేకపోవడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. 

పలుమార్లు బ్రిటన్ ప్లేయర్స్ భారత గోల్ పోస్టుపై దాడి చేసినప్పటికీ... సవిత వాటిని సమర్థవంతంగా ఆపి స్కోర్ షీట్ ని క్లీన్ గా ఉంచగలిగింది. భారత డిఫెన్స్ ఫస్ట్ హాఫ్ లో ఒకింత ఫ్లోలో లేనట్టుగా కనిపించింది. పదేపదే బ్రిటన్ ప్లేయర్స్ చాలా తేలికగా సర్కిల్ పెనట్రేషన్స్ ని చేయగలిగారు. 

ఇక రెండవ క్వార్టర్ ప్రారంభమైన నిమిషంలోపే బ్రిటన్ తొలి గోల్ ని సాధించింది. దృరదృష్టవశాత్తు భారత డిఫెండర్ డీప్ గ్రేస్ ఎక స్టిక్ నుంచి ఈ గోల్ వచ్చింది. బ్రిటన్ ప్లేయర్ ఇచ్చిన పాస్ ని బ్రిటన్ కెప్టెన్ మార్టిన్ కి దొరక్కుండా చేయడం కోసం స్టిక్ ని అడ్డం పెట్టగా అది డిఫ్లెక్ట్ అయి నేరుగా గోల్ పోస్ట్ లోకి వెళ్ళింది. ఆ వెంటనే బ్రిటన్ మరో పెనాల్టీ కార్నర్ ని దక్కించుకుంది. కానీ ఆ పెనాల్టీ కార్నర్ ని గోల్ గా బ్రిటన్ మరల్చలేకపోయింది. 

ఆ తరువాత భారత్ కి అందివచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. వేరియేషన్ ట్రై చేసి భారత్ గోల్ అవకాశాన్ని జారవిడుచుకుంది. పదే పదే బాల ని భారత డి లోకి తీసుకొస్తున్న బ్రిటన్ భారత గోల్ పోస్టుపై వరుస దాడులు చేసింది. ఆ తరువాత భారత ప్లేయర్ నిషా గ్రీన్ కార్డు వల్ల రెండు నిముషాలు మ్యాచ్ కి దూరం అవ్వాల్సి వచ్చిన సందర్భంలో... 10 మంది ప్లేయర్స్ మాత్రమే ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బ్రిటన్ మరో గోల్ ని సాధించి 2-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. 

ఇక ఆ వెంటనే భారత్ తనకు వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గోల్ గా మరల్చింది. భారత డ్రాగ్ ఫ్లికర్ గుర్జీత్ కౌర్ భారత్ కి శుభారంభాన్ని అందించి బ్రిటన్ ఆధిక్యాన్ని 2-1 కి తగ్గించింది. అక్కడితో ఆగకుండా రెండవ క్వార్టర్ మరింత ఉత్కంఠకు తెర తీసింది. భారత్ మరో రెండు గోల్స్ ని సాధించి 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోసారి వందన కటారియా ఈ గోల్ ని సాధించి భారత్ కు ఆధిక్యాన్ని అందించింది. హాఫ్ టైం ముగిసేసరికి భారత్ ఒక గోల్ ఆధిక్యంలో నిలిచింది. 

మూడవ క్వార్టర్ ప్రారంభంలోనే బ్రిటన్ పెనాల్టీ కార్నర్ ని సాధించింది. కానీ భారత్ దాన్ని సేవ్ చేయగలిగింది. ఇక ఆ తరువాత ఎగ్రెసివ్ గా ఆడిన బ్రిటన్ భారత ప్లేయర్స్ ని డబల్ టీం చేస్తూ అద్భుతమైన ఫీల్డ్ గోల్ ని సాధించి స్కోర్ ని 3-3 తో సమం చేసింది. ఇక ఇదే మూడవ క్వార్టర్లో భారత్ సైతం బ్రిటన్ గోల్ పోస్టుపై దాడి చేసింది. కానీ 3-3 తోనే మూడవ క్వార్టర్ ముగిసింది. 

ఇక నాలుగవ క్వార్టర్ ప్రారంభం నుండే బ్రిటన్ కి వరుస పెనాల్టీ అవకాశాలు దక్కాయి. వాటిని సద్వినియోగం చేసుకొని... భారత్ డిఫెన్సె ని దాటుకొని బ్రిటన్ మరొక గోల్ ని సాధించి 4-3 కి తమ ఆధిక్యాన్ని పెంచుకుంది. ఆ తరువాత భారత్ కూడా వరుస ప్రయత్నాలు చేసింది. భారత్ ఓటమిపాలైనప్పటికీ.... రరియో 2016 ఒలింపిక్స్ విన్నర్ కి గట్టి పోటీ ఇచ్చారు. చివరి క్షణం వరకు పోరాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios